Wed May 14 2025 06:17:26 GMT+0000 (Coordinated Universal Time)
Single : చిన్న సినిమాలని చిన్న చూపు వద్దండీ.. "సింగిల్" చూస్తే తెలియడం లేదూ?
శ్రీ విష్ణు నటించిన సింగిల్ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్లు కూడా భారీగా వస్తున్నాయి

పెద్ద సినిమాలు పక్కన పెడితే... కథతో పాటు కామెడీ.. టైమింగ్ ఉంటే మాత్రం ప్రేక్షకులు గేట్లు తోసుకుని మరీ సినిమా థియేటర్లలోకి వెళుతున్నారు. అనేక చిన్న సినిమాలు హిట్ టాక్ తెచ్చుకుని ఫుల్లు కలెక్షన్లు తెస్తున్నాయంటే అందులో బలమైన కథనంతో పాటు సెంటిమెంట్.. కామెడీ.. తో పాటు సస్పెన్స్ కూడా ప్రేక్షకులు స్వాగతిస్తున్నారు. అసలు ఇదేం సినిమా అన్నది కూడా నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుంది. అందుకే చిన్నసినిమాలంటూ చిన్న చూపు వద్దంటున్నారు. పెద్ద పెద్ద నిర్మాతలైన అల్లు అరవింద్, దిల్ రాజు వంటి వారు కూడా చిన్న మూవీలను తెరకెక్కించడానికి ఆసక్తి చూపుతున్నారు.
ప్రేక్షకుల ఆదరణ...
ఇటీవల విడుదలయిన కోర్టు మూవీ నాని నిర్మించినా అది బాక్సాఫీసు వద్ద హిట్ అయింది. ఎటువంటి స్టార్ డమ్ లేకపోయినా సరే ప్రేక్షకులు సినిమా థేయటర్ కు క్యూ కడుతున్నారు. ఇక యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన అనేక సినిమాలు ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. ముందు సైడ్ యాక్టర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీ విష్ణు తర్వాత హీరోగా వచ్చి క్లిక్ అయ్యాడు. సామజవరగమన... ఓం భీమ్ బుష్ వంటి మూవీలు బాగా ఆడాయి.మంచి టైమింగ్ ఉన్న హీరో అతడు.మంచి రూపంతో పాటు డైలాగ్ డెలివరీ కూడా బాగా నప్పుతుండటంతో శ్రీ విష్ణు మూవీ అంటే మినిమమ్ హిట్ అన్న ధోరణికి నిర్మాతలు వచ్చేశారు.
కలెక్షన్ల వర్షం...
తాజాగా విడుదలయిన సింగిల్ మూవీ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఫుల్లు కామెడీతో ఉన్న ఈ సినిమా థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తుంది. వెన్నెల కిషోర్, శ్రీవిష్ణు కామెడీలు బాగా వర్క్ అవుట్ కావడంతో ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయి తాము పెట్టిన డబ్బులు వృధా కాలేదని చెబుతున్నారు. అయితే లేటెస్ట్ గా విడుదలయిన సింగిల్ మూవీ తొలిరోజు 4.15కోట్ల రూపాయల కలెక్షన్లు తెచ్చిపెట్టింది. ఈ మూవీకి క్రిటిక్స్ కూడా మంచి రేటింగ్స్ ఇవ్వడంతో ప్రేక్షఖులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన ఆదాయం నుంచి కొంత భారత సైన్యానికి ఇస్తానని నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు.
Next Story