Fri Dec 05 2025 16:39:12 GMT+0000 (Coordinated Universal Time)
Tolly Wood : విదేశాల్లో షూటింగ్ వల్ల ఇన్ని లాభాలున్నాయా? టాలీవుడ్ నిర్మాతలు ఏమంటున్నారంటే?
తెలుగు నిర్మాతలు, దర్శకులు ఎక్కువ మంది విదేశాల్లో షూటింగ్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు

తెలుగు నిర్మాతలు, దర్శకులు ఎక్కువ మంది విదేశాల్లో షూటింగ్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తన కొత్త చిత్రం SSMB 29 షూటింగ్ కోసం అనుమతినిచ్చినందుకు కెన్యా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది టాలీవుడ్ చిత్రసీమలో ఒక కొత్త ధోరణికి నిదర్శనం. ‘ది ఫ్యామిలీ స్టార్’ అమెరికాలో, ‘మనమే’ లండన్‌లో చిత్రీకరణ జరిపినట్లు, మరింత మంది దర్శకులు విదేశీ లొకేషన్లలో చిత్రాలు తీసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీటివల్ల సినిమాలో కొత్త దనం కనిపించడం మాత్రమే కాకుండా, మరో లాభం కూడా ఉంది. పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి విదేశీ ప్రభుత్వాలు నిర్మాణ వ్యయాలలో ఇరవై శాతం నుంచి యాభై శాతం వరకు రీయింబర్స్మెంట్ ఇస్తాయి. యూకే, యూఎస్, దక్షిణాఫ్రికా, యూరప్, ఆస్ట్రేలియా, దుబాయ్, కెన్యా లాంటి దేశాలు ఈ విధానం అమలు చేస్తున్నాయి.
సబ్సిడీ లభిస్తుందని...
నిర్మాత అభిషేక్ నామా ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ “విదేశాల్లో చిత్రీకరణ చేస్తే కొంత ఆర్థిక భారం తగ్గుతుంది. కానీ ఇది అంత సులభం కాదు. స్థానిక ప్రొడక్షన్ హౌస్‌లతో ఒప్పందాలు కుదుర్చుకోవాలి, ఆడిట్లు పూర్తి చేయాలి” అని తెలిపారు. నిర్మాత అనిల్ సుంకర మహేశ్ బాబు నటించిన నెంబర్ 1 నేనొక్కడినే చిత్రానికి యూకే టూరిజం విభాగం నుండి పది కోట్లకుపైగా సబ్సిడీ పొందారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయన దీనిపై స్పందిస్తూ “చిన్న మొత్తంలో సబ్సిడీ లభించింది. కానీ మాకు ముఖ్యంగా నచ్చింది అక్కడ సునాయాసంగా షూటింగ్ జరుపుకున్నాం" అని తెలిపారు. .
కొత్త లోకేషన్ లో చేయడం వల్ల...
మరో నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నాన్నకు ప్రేమతో, తొలిప్రేమ, మిస్టర్ మజ్ను లండన్‌లో షూటింగ్ చేసిన అనుభవాన్ని పంచుకుంటూ – “సబ్సిడీలు పెద్దగా రావు, ఎక్కువ పేపర్‌వర్క్ అవసరం. మా లొకేషన్ ఎంపిక ప్రధానంగా కథ డిమాండ్ వల్లే ” అని చెప్పడం విశేషం. దర్శకుడు హేమంత్ మాధుకర్ అమెరికాలో షూటింగ్ చేసిన అనుభవాన్ని వివరించారు: “కొత్త వాతావరణంలో పనిచేయడం దర్శకుడికి క్రియేటివ్ ఇన్స్పిరేషన్ ఇస్తుంది. సబ్సిడీ ఒక బోనస్ మాత్రమే. కానీ నేటి ప్రేక్షకులు కథతో మరింత కనెక్ట్ అవుతారు, ఎందుకంటే ప్రతి తెలుగు కుటుంబంలో ఎవరో ఒకరు విదేశాల్లో చదువుతున్నారు లేదా పనిచేస్తున్నారు.” అని ఆయన అన్నారు. అందుకోసమే విదేశాల్లో ఎక్కువగా షూటింగ్ లు చేయడానికి టాలీవుడ్ నిర్మాతలు, దర్శకలు మొగ్గు చూపుతుున్నారని తెలిపారు. దీంతోపాటు అక్కడ షూటింగ్ లకు అభిమానుల నుంచి అంతరాయం కూడా ఉండదని, అందుకే అక్కడ షూటింగ్ చేయడానికి హీరోలు కూడా మొగ్గుచూపుతారంటున్నారు.
Next Story

