Fri Dec 05 2025 21:53:26 GMT+0000 (Coordinated Universal Time)
గండికోటలో భారతీయుడు 2 షూటింగ్
స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రాయలసీమలో జరుగుతోంది.

విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని.. తిరిగి ఫామ్ లోకి వచ్చారు కమలహాసన్. ఇప్పుడు అదే జోష్ లో వాయిదా పడిన భారతీయుడు2 ను కూడా తిరిగి ట్రాక్ లోకి తీసుకొచ్చారు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రాయలసీమలో జరుగుతోంది. కడపజిల్లాలోని గండికోటలో వేసిన ప్రత్యేక సెట్ లో బ్రిటీష్ కాలం నాటి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అప్పట్లో కూరగాయలు, పశువుల అమ్మకాలు జరుగుతున్న మార్కెట్‌పై బ్రిటీష్ పోలీసులు దాడి చేస్తుంటే, కమల్ వారిని ఎదుర్కునే సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
బిగ్ బాస్ తమిళ సీజన్ 6 షూటింగ్ ను ముగించిన అనంతరం.. కమలహాసన్ పూర్తిగా ఈ సినిమాపైనే దృష్టిసారించారు. కమలహాసన్ ప్రతిరోజూ తిరుపతి నుండి హెలికాప్టర్ లో షూటింగ్ కోసం గండికోటకు వచ్చి వెళ్తున్నారు. కమల్ తో పాటు ఆయన స్టైలిస్ట్ అమృత రామ్ కూడా ఆయన వెంటే ఉంటున్నారు. కాగా.. కమల్ చాపర్ లో స్పాట్ కు వచ్చిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో కమల్ కు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరణ్ తో కలిసి ఉదయనిధి స్టాలిన్ దీనిని నిర్మిస్తున్నారు.
Next Story

