Fri Dec 05 2025 22:45:45 GMT+0000 (Coordinated Universal Time)
Tollywood : నో యాక్షన్.. నో కెమెరా...నిలిచిపోయిన షూటింగ్స్
టాలీవుడ్ లో ఇటు సినీ కార్మికులు, అటు నిర్మాతలు భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో పదిహేను రోజుల నుంచి కెమెరాలు ఆఫ్ అయి ఉన్నాయి

టాలీవుడ్ లో ఇటు సినీ కార్మికులు, అటు నిర్మాతలు భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో పదిహేను రోజుల నుంచి కెమెరాలు ఆఫ్ అయి ఉన్నాయి. గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి లేదు. అలివికాని డిమాండ్లను తమ ముందుంచారని నిర్మాతలు చెబుతున్నారు. అదే సమయంలో తమ పనికి తగినట్లు వేతనాలను పెంచాలంటూ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇద్దరి వాదనల్లో నిజముందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే గతంలో మాదరిగా ఇప్పుడు చిత్ర పరిశ్రమ లేదు.
సక్సెస్ కావడం లేదని...
ఎక్కువ చిత్రాలు సక్సెస్ రేటుకు దూరంగా ఉంటున్నాయి. వంద సినిమాలు విడుదలయితే అందులో పదిలోపు సినిమాలు మాత్రమే హిట్ అయి నిర్మాతలకు ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నాయన్నది నిర్మాతల మండలి వాదన. ఓటీటీలకు జనం అలవాటు పడటంతో పాటు థియేటర్లలో ఖర్చు తడిసి మోపెడు కావడంతో సినిమాను చూసేందుకు గతంతో పోలిస్తే థియేటర్లకు రావడం జనం తగ్గించారు. థియేటర్లకు వస్తే జేబులు గుల్ల అవుతుందని భావించి తమ పిల్లలను మరొక చోటకు ప్రత్యామ్నాయంగా వినోదం కోసం తీసుకెళుతున్నారు.
బాక్సాఫీస్ వద్ద...
దీంతో పలు మూవీలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో నిర్మాతలపై మరింత భారం పడితే తట్టుకోలేమని వారు అంటున్నారు. అదే సమయంలో తమ కష్టాన్ని నిర్మాతలు దోచుకుంటున్నారని సినీ కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే తమకు పదమూడు కోట్ల రూపాయలు నిర్మాతలు బాకీ ఉన్నారని, తమతో వెట్టి చాకరీ చేయించుకుని ఒప్పందం ప్రకారం మూడేళ్లకు ఒకసారి వేతనం పెంచకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు, నిర్మాతల మండలికి మధ్య జరిగిన చర్చలు సఫలం కాలేదు.
పదిహేను రోజుల నుంచి...
దీంతో గత పదిహేను రోజుల నుంచి షూటింగ్స్ నిలిచిపోయాయి. ఈరోజు కార్మిక సంఘాల నేతలు మెగాస్టార్ చిరంజీవిని కలవనున్నారు. అంతుకు ముందు ఫెడరేషన్ కార్యాలయంలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. గత పదిహేను రోజులుగా రెండు వర్గాల మధ్య జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి రాలేదు. నేడు, రేపు కూడా చర్చలు జరిగే అవకాశముంది. అయితే కార్మిక సంఘాలు పెట్టిన అన్ని డిమాండ్లను అంగీకరించే పరిస్థితుల్లో లేమని నిర్మాతలు చెబుతుండగా, తమకు బకాయీపడిన పదమూడు కోట్ల రూపాయల వేతనాలు చెల్లించాలని కార్మికసంఘాలు పట్టుబడుతున్నాయి. అయితే చర్చలు సఫలం కాకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. మరి అప్పటి వరకూ నో యాక్షన్... నో కెమెరా ఆన్ అనాల్సిందే.
Next Story

