Fri Dec 05 2025 17:49:42 GMT+0000 (Coordinated Universal Time)
ఆసుపత్రి పాలైన విక్రమ్.. అసలు విషయం ఇదంటున్న మేనేజర్
హీరో విక్రమ్ ఆరోగ్యంపై వైరల్ అవుతున్న వార్తలపై.. ఆయన మేనేజర్ సూర్యనారాయణన్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

హీరో విక్రమ్ ఆరోగ్యంపై వైరల్ అవుతున్న వార్తలపై.. ఆయన మేనేజర్ సూర్యనారాయణన్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. విక్రమ్ కు ఛాతీలో స్వల్పంగా అసౌకర్యం ఏర్పడిందని, దాంతో ఆసుపత్రిలో చేరారని వెల్లడించారు. ఆయనకు గుండెపోటు వచ్చిందన్న వార్తలు నిజం కాదని సూర్యనారాయణనన్ స్పష్టం చేశారు. ఇలాంటి పుకార్లు వినాల్సి రావడం బాధాకరమని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో విక్రమ్ కుటుంబం పరిస్థితిని కూడా ఆలోచించాలని, వారి వ్యక్తిగత జీవితానికి ఇబ్బందికరంగా మారకూడదన్నారు. విక్రమ్ రేపు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశాలు ఉన్నాయని మేనేజర్ వెల్లడించారు. ఈ అధికారిక ప్రకటనతో విక్రమ్ ఆరోగ్యం విషయంలో స్పష్టత వస్తుందని భావిస్తున్నామని, ఊహాగానాలకు అడ్డుకట్ట పడుతుందని అన్నారు. అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందాల్సిన పనిలేదని సూర్యనారాయణన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
నటుడు చియాన్ విక్రమ్ అస్వస్థతకు గురవ్వడంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రి వర్గాల ప్రకారం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యుల సంరక్షణలో ఉన్నారు. చెన్నైలో సాయంత్రం 6 గంటలకు జరగాల్సిన పొన్నియిన్ సెల్వన్ టీజర్ లాంచ్లో విక్రమ్ పాల్గొనాల్సి ఉంది. ఈరోజు ఆయన డిశ్చార్జి అయ్యే అవకాశం ఉంది. ఈరోజు టీజర్ లాంచ్కు తాను హాజరు కావడం లేదని విక్రమ్ పొన్నియిన్ సెల్వన్ టీమ్కి తెలియజేశారు. కొన్ని రోజుల పాటూ విక్రమ్ విశ్రాంతి తీసుకోనున్నారు. జూలై 11న జరగనున్న 'కోబ్రా' సినిమా ఆడియో లాంచ్కు హాజరవుతారు. చియాన్ విక్రమ్ నటించిన 'పొన్నియిన్ సెల్వన్' సినిమా విడుదల కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 30న థియేటర్లలోకి రానుంది. విక్రమ్ నటించిన కోబ్రా సినిమా ఆగష్టు 11న విడుదలకానుంది.
Next Story

