Fri Dec 05 2025 14:04:35 GMT+0000 (Coordinated Universal Time)
హాస్యం వికటిస్తుంది.. సరదా సీరియస్ గా మారుతుందిగా అప్పారావ్
సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ వయసు పెరుగుతున్న కొద్దీ వివాదాలు చుట్టుముడుతున్నాయి.

సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ వయసు పెరుగుతున్న కొద్దీ వివాదాలు చుట్టుముడుతున్నాయి. రాజేంద్ర ప్రసాద్ నిజానికి మంచి నటుడు. ఆయన నటించిన సినిమాలు 90వ దశకంలో అందరినీ ఆకట్టుకున్నాయి. అహ నా పెళ్లంట, లేడీస్ టైలర్, ఆ ఒక్కటీ అడక్కు, అప్పుల అప్పారావు, రాజేంద్రుడు - గజేంద్రుడు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సినిమాలు కేవలం రాజేంద్ర ప్రసాద్ వల్లనే హిట్ అయ్యాయని చెప్పకత ప్పదు. ఎందుకంటే నటకిరీటిగా ఆయన కున్న టైమింగ్ తో పాటు మంచి రూపం.. కుటుంబంలో ఒకరిగా అందరూ భావించి రాజేంద్ర ప్రసాద్ ను ప్రేక్షకులు దగ్గరకు తీసుకున్నారు.
సెకండ్ ఇన్నింగ్స్ లో...
ఇక సెకండ్ ఇన్నింగ్స్ లోనూ రాజేంద్ర ప్రసాద్ నటనను ఎవరూ తప్పు పట్టలేరు. రాజేంద్ర ప్రసాద్ ఉన్నారంటే కామెడీకి కొదవలేదు. అగ్రహీరోల పక్కన నటిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకతను రాజేంద్ర ప్రసాద్ సంపాదించుకున్నారు. అయితే వయోభారం వల్లనో.. మరే కారణం వల్లనో తెలియదు కానీ రాజేంద్ర ప్రసాద్ తరచూ సినీ కార్యక్రమాలలో మాటలు తూలుతున్నారు. ఆయన మాటలు నవ్వులు తెప్పించే దానికంటే ఆయనపై ఉన్న అభిమానం స్థానంలో ఏహ్య భావం కలిగించే విధంగా ఆయన వ్యాఖ్యలున్నాయి.
వేదికలపై కాంట్రవర్సీలతో...
వరసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో డేవిడ్ వార్నర్ ను అసభ్యకరమైన పదజాలంతో దూషించాడు. వార్నర్ కు ఇది అర్థం కాకపోవచ్చు కానీ, వార్నర్ ను అభిమానించే వారికి మాత్రం బాధ కలిగింది. ఆ మధ్య నేషనల్ అవార్డు విషయంలో మాట్లాడుతూ అల్లు అర్జున్ పై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు బన్నీ ఫ్యాన్స్ కన్నెర్రకు గురి చేయడంతో క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇక తాజాగా ఎస్వీ కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల్లో మాట్లాడుతూ హాస్య నటుడు ఆలీని అసభ్యకరంగా మాట్లాడటం..అచ్చిరెడ్డిని వేదికపైనే దూషించడం, బ్రెయిన్ పోయిందా? చప్పట్లు కొట్టాలంటూ అడుక్కోవడం రాజేంద్ర ప్రసాద్ ను మరీ కిందకు దిగజార్చింది. ఇలా కామెడీ అనుకుంటూ సరదాకి అని సర్దిచెప్పుకుంటున్నా రాజేంద్ర ప్రసాద్ విషయంలో మాత్రం ఇక వేదికపై పిలవాలంటే సినీ నిర్మాతలు, దర్శకులు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Next Story

