Wed Mar 11 2026 02:39:44 GMT+0530 (India Standard Time)
పుష్ప థ్యాంక్యూ మీట్ - టెక్నీషియన్లకు రూ.లక్ష ప్రకటించిన సుకుమార్
పుష్ప సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో.. ఆ సినిమా టీమ్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు మంగళవారం హైదరాబాద్ లో థాంక్యూ మీట్ ఏర్పాటు చేసింది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను.. పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మార్చేశారు దర్శకుడు సుకుమార్. అల్లు అర్జున్ స్టైల్ ను పక్కకు పెట్టి.. అతనిలోని టాలెంట్ ను బయటికి తీశారు. పుష్ప ది రైజ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 17వ తేదీన విడుదలై.. ఇప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. బాక్సాఫీస్ లో పాత రికార్డులను చెరిపేసి.. కొత్త రికార్డును సృష్టించే దిశగా పుష్పరాజ్ దూసుకుపోతున్నాడు. ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా రూ.275 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా.. కేరళతో పాటు.. బీ టౌన్ లోనూ భారీ వసూళ్లు రాబట్టింది.
టెక్నీషియన్లు ఒక్కొక్కరికి లక్ష
పుష్ప సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో.. ఆ సినిమా టీమ్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు మంగళవారం హైదరాబాద్ లో థాంక్యూ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా పుష్ప దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురయ్యారు. సినిమా కోసం కష్టపడిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. పుష్ప సినిమాకు పనిచేసిన కిందిస్థాయి టెక్నీషియన్లు.. అంటే ప్రొడక్షన్, సెట్ అండ్ లైట్ మెన్లకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇస్తానని ప్రకటించి.. తన ఉదారతను చాటుకున్నారు సుక్కు.
నా ఫేవరెట్ హీరోయిన్ సమంత
తన కష్టంలో సగభాగం భార్య తబితకే చెందుతుందంటూ ఆమెకి థ్యాంక్స్ చెప్పారు సుకుమార్. ప్రముఖ గీత రచయిత చంద్రబోస్‌కు పాదాభివందనం చేసిన సుకుమార్.. నిర్మాతల దగ్గర నుండి ఆర్టిస్టులతో పాటు ప్రతి టెక్నీషియన్‌కి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలా ఆయన మాట్లాడుతుండగానే.. బన్నీ కూడా ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమాలో సమంత ఐటెం సాంగ్ లో కనిపించగా.. ఆమె తన ఫేవరెట్ హీరోయిన్ అని తెలిపారు సుకుమార్. అలాగే ఈ సినిమాకోసం తాను ఏం చెప్పినా బన్నీ కాదనకుండా చేశాడని పొగిడారు.
Next Story

