Thu Mar 19 2026 13:29:43 GMT+0530 (India Standard Time)
ఉస్తాద్ భగత్ సింగ్ కంటే ‘ధురంధర్ 2’కు ఎక్కువ స్క్రీన్లు?
తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిస్థితి కనిపిస్తోంది

తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిస్థితి కనిపిస్తోంది. రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ విడుదల రోజున, పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదలయింది. అయితే పవన్ కల్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ కంటే దురంధర్ కు ఎక్కువ స్క్రీన్లు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్‌కు లక్షలాది మంది అభిమానులున్నారు. అయితే దురంధర్ -1 సూపర్ డూపర్ హిట్ కావడంతో సీక్వెల్ కు కూడా అంతే స్థాయిలో కలెక్షన్లు వస్తాయని అంచనా వేసుకున్నట్లుంది.
సీక్వెల్ పై ఉన్న ఆసక్తితోనే...
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు తక్కువ స్క్రీన్లు దక్కడం పవన్ కల్యాణ్ కు ఉన్న భారీ అభిమాన వర్గం దృష్ట్యా ఈ పరిణామం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ముఖ్యంగా పండగలా ఉండే విడుదల సమయాల్లో స్థానిక స్టార్ సినిమాలే ఎక్కువ స్క్రీన్లు దక్కించుకోవడం సాధారణం. ఈసారి పరిస్థితి భిన్నంగా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.‘ధురంధర్ 2’కు మొదటి భాగం విజయంతో పాటు దూకుడైన కలెక్షన్లు కలిసి వచ్చాయని భావిస్తున్నారు. హైదరాబాద్‌లోని పలు మల్టీప్లెక్సుల్లో ఈ హిందీ సినిమాకు గణనీయంగా షోలు కేటాయించారని సమాచారం. కొన్ని థియేటర్లలో మొదటి రోజే పన్నెండుకు పైగా ప్రదర్శనలు నిర్వహించారని చెబుతున్నారు. సీక్వెల్‌పై ఉన్న ఆసక్తి, పాన్ ఇండియా కంటెంట్‌పై పెరుగుతున్న ఆకర్షణ దీనికి కారణంగా కనిపిస్తోంది.
ఉస్తాద్ కు టాక్ ను బట్టి...
అయితే ఈ ఆధిక్యం ఎక్కువ కాలం ఉండకపోవచ్చని బాక్సాఫీస్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు మంచి టాక్ వస్తే త్వరగా పరిస్థితి మారే అవకాశముందని చెబుతున్నారు. “తెలుగు మార్కెట్లో చివరికి కంటెంట్‌దే గెలుపు. సినిమా ప్రేక్షకులకు నచ్చితే కొద్ది రోజుల్లోనే పోటీ సినిమాను సమానంగా చేరుకోవచ్చు, దాటిపోవచ్చు అని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిణామం ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పును కూడా సూచిస్తోంది. ఓటీటీ వేదికల పెరుగుదలతో భాషాపరమైన అడ్డంకులు తగ్గుతున్నాయి. విభిన్న భాషల సినిమాలు సులభంగా అందుబాటులోకి రావడంతో కంటెంట్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది.
Next Story

