Wed Oct 16 2024 05:25:26 GMT+0000 (Coordinated Universal Time)
Tollywood: డ్యాన్స్ మాస్టర్...మాటల మాంత్రికులు ఇంకా ఎందరు? టాలీవుడ్లో హాట్ టాపిక్
టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై వివాదాలు చుట్టుకుంటున్నాయి.
ఆ మధ్య తమిళనాడు.. మొన్న మలయాళం, నిన్న కర్ణాటక, నేడు టాలీవుడ్ ఇలా క్యాస్టింగ్ కౌచ్ పై వివాదాలు చుట్టుకుంటున్నాయి. అనేక మంది సినీ రంగంలోకి వచ్చిన యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, వారు తమతో శారీరకంగా సహకరిస్తేనే అవకాశాలు అని బెదిరిస్తుండటం, లొంగదీసుకోవడం మామూలయిపోయింది. సినీ పరిశ్రమ ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ వివాదాలు మాత్రం ఆగడం లేదు. నటులు, దర్శకులు, డ్యాన్స్మాస్టర్లు ఎక్కడ వీలుంటే... ఎవరు వీలయితే వారు సినిమాల్లో అవకాశాల కోసం వచ్చిన యువతులను లొంగదీసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు జగుప్సను కలిగిస్తున్నాయి. అత్యధిక పారితోషికాలు తీసుకుంటుండటమే కాదు.. ఫేమ్... ఫ్యాన్స్ ను ఎంతో సంపాదించుకున్న వారు కూడా ఇలాంటి నీచ ప్రవృత్తికి దిగజారడం ఇప్పుడు టాలీవుడ్ లోనూ చర్చనీయాంశంగా మారింది.
జానీ మాస్టర్ పై...
ప్రధానంగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ముసురుకున్న వివాదంతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. ఒక మహిళ డ్యాన్సర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విషయం వెలుగు చూసింది. జానీ మాస్టర్ తనపై కుట్ర జరిగిందని ఆరోపిస్తున్నా ఈరోజు ఆయనకు పోలీసులు నోటీసులు అందచేసినట్లు సమాచారం. ఈ కేసులో తనకు ఏమాత్రం సంబంధం లేదని తనను కేసులో ఇరికించడానికి ప్రత్యర్థులు ఆడుతున్న డ్రామాకు ఆ మహిళ డ్యాన్సర్ ను వినియోగించుకున్నారని జానీ మాస్టర్ చెబుతున్నప్పటికీ ఆయన మాటలు నమ్మశక్యంగా లేవు. ఆయనపై మహిళ డ్యాన్సర్ చేసిన ఆరోపణలతో డ్యాన్సర్స్ అసోసియేషన్ కూడా నేడు నిర్ణయం తీసుకోనుంది. జానీ మాస్టర్ తప్పు చేశారా? లేదా? అన్నది పక్కన పెడితే అసలు తనపై వచ్చిన ఆరోపణలపై నిజానిజాలు బయట పడేంత వరకూ ఆయనను దోషిగా చూడాల్సిందేనంటున్నాయి సినీ పరిశ్రమ వర్గాలు. ఆయనపై 24 క్రాఫ్ట్స్ చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
తివిక్రమ్ శ్రీనివాస్ పై కూడా...
దీంతో పాటు మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. నటి తివిక్రమ్ శ్రీనివాస్ పై ఆరోపణలు చేసింది. గతంలో తాను ఇచ్చిన ఫిర్యాదును కూడా పరిశీలించాలని కోరింది. తెలుగు, తమిళం,మళయాళ పరిశ్రమలో పనిచేసిన ఈ నటి తాను చేసిన ఫిర్యాదును మూవీ ఆర్టిస్ట్ అసోయిేషన్ కూడా చర్యలు తీసుకోలేదని ఎక్స్ లో ఆమె ఆవేదన చెందారు. తాను తివిక్రమ్ పై చిత్ర పరిశ్రమలోని పలువురి పెద్దలకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు మౌనంగా ఉండిపోయారని పేర్కొంది. తివిక్రమ్ శ్రీనివాస్ నటి ఆరోపణలపై ఇంత వరకూ స్పందించలేదు. ఆయన ప్రసంగంలో అనేక ప్రవచనాలు వినిపిస్తాయి. తీసిన సినిమాలు కూడా ఆదర్శంగా ఉంటాయి. నవ్వులతో పాటు ఒక సందేశాన్ని సమాజానికి ఇస్తుంటారు తివిక్రమ్. టాలీవుడ్ లో పెద్దలు కూడా దీనిపై ఇంత వరకూ పెదవి విప్పక పోవడం కూడా ఒకింత ఆశ్చర్యం కలిగిస్తుంది.
సమాధానమేది?
కానీ అందుకు విరుద్ధంగా తనపై వస్తున్న ఆరోపణలకు ఆయన సమాధానం చెప్పకపోవడంపై కూడా టాలీవుడ్ లో చర్చ జరుగుతుంది. ఆరోపణలు చేసే వారు నిజాయితీపరులని చెప్పలేం. అదే సమయంలో అందులో నిజం లేదని తోసిపుచ్చలేం. కానీ మహిళలు ఒక ఆరోపణ చేస్తున్నారంటే అందులో ఉండే వాస్తవాలకు తమంతట తాము చెప్పుకోవాల్సి ఉంటుంది. తప్పు చేయకుంటే భయం అవసరం లేదంటున్నాయి పరిశ్రమవర్గాలు. అదేసమయంలో అందరి మీద రాని ఆరోపణలు కొందరి మీదే వస్తున్న కారణంగా దీనిపై కూడా ఆలోచించాలని, సీనియర్ నటులు, దర్శకులను చూసి అయినా టాలీవుడ్ యంగ్ హీరోలు, దర్శకులు, డ్యాన్స్ మాస్టర్లు ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. లేకుంటే వారి రంగుల జీవితానికి వారే ఎండ్ కార్డు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి టాలీవుడ్ పెద్దలు దీనిపై ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది. బీజేపీ నేతలు కూడా జానీ మాస్టర్ వివాదంపై లవ్ జీహాద్ ఆరోపణలు చేస్తున్నారు. వీటన్నింటికీ సినీ పరిశ్రమ రెస్పాండ్ కాకుంటే ప్రేక్షకులకు దూరం అయ్యే అవకాశాలున్నాయి.
Next Story