Sun Dec 08 2024 19:22:11 GMT+0000 (Coordinated Universal Time)
Chiranjeevi : త్రిషకు అండగా నిలిచిన చిరంజీవి..
త్రిష, మన్సూర్ అలీఖాన్ వివాదంలో మెగాస్టార్ చిరంజీవి త్రిషకు అండగా నిలుస్తానంటూ తన సపోర్ట్ ని తెలియజేశారు.
స్టార్ హీరోయిన్ త్రిష గురించి ఇటీవల తమిళ్ నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన అభ్యంతర కామెంట్స్ ప్రతి ఒక్కర్ని ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. విలన్ రోల్స్ చేసే ఈ నటుడు.. కెరీర్ లో చాలా మంది హీరోయిన్స్ తో రేప్ సీన్స్ లో నటించానని, ఆ సీన్స్ చేస్తున్నప్పుడు తాను చాలా ఎంజాయ్ చేసేవాడినని, అయితే 'లియో' సినిమాలో త్రిష అలంటి సీన్ లేనందుకు తాను చాలా ఫీల్ అయ్యాను అంటూ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
ఇక ఈ వ్యాఖ్యలు పై త్రిష స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఆమెకు సపోర్ట్ గా నిలుస్తూ పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ విషయం పై స్పందిస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే మాళవిక మోహనన్, చిన్మయి, లోకేష్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజు, నితిన్.. త్రిషని సపోర్ట్ చేస్తూ ట్వీట్స్ చేస్తూ వస్తున్నారు. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ విషయం పై స్పందిస్తూ ట్వీట్ చేశారు.
"ఇటీవల త్రిష గురించి మన్సూర్ అలీ ఖాన్ చేసిన అభ్యంతర కామెంట్స్ నా దృష్టికి వచ్చాయి. అవి తోటి ఆర్టిస్టుని, మహిళని అవమానపరిచేలా ఉన్నాయి. అతను చేసిన కామెంట్స్ ని నేను తీవ్రగా ఖండిస్తున్నాను. త్రిషకు మాత్రమే కాదు ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే ప్రతిఒక్కరికి నేను అండగా నిలుస్తాను" అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. చిరంజీవి కూడా ఈ విషయం గురించి కామెంట్స్ చేయడంతో.. ఈ మ్యాటర్ మరింత సీరియస్ అయ్యింది.
దీని పై జాతీయ మహిళా కమిషన్ సభ్యులు కుష్బూ కూడా స్పందిస్తూ ఫైర్ అయ్యారు. ఈ విషయాన్ని తాము పర్సనల్ గా తీసుకోని.. నేరుగా తమిళనాడు డీజీపీ దృష్టికి తీసుకు వెళ్తామంటూ వెల్లడించారు. ఇది ఇలా ఉంటే, మన్సూర్ అలీఖాన్ తన వ్యాఖ్యలు స్పందిస్తూ ఒక పోస్ట్ వేశాడు. తాను మాట్లాడిన వీడియో మొత్తం చూడకుండా ఒక చిన్న క్లిప్ ని ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. తాను పాలిటిక్స్ లోకి రాబోతున్నట్లు, దానిని డామేజ్ చేసేందుకు ఇలా తన మీద కుట్ర జరుగుతుందని పేర్కొన్నాడు.
Next Story