Sat Dec 07 2024 14:50:04 GMT+0000 (Coordinated Universal Time)
Disha patani అయ్యో.. నటి దిశా పటానీ తండ్రిని అలా మోసం చేశారా?
లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దిశా పటానీ
లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దిశా పటానీ ఇటీవల కంగువా సినిమా ద్వారా మరోసారి అందరినీ పలకరించింది. ఇప్పుడు ఆమె తండ్రి వార్తల్లో నిలిచారు. ఆయనను కొందరు మోసం చేశారు. నటి దిశా పటానీ తండ్రి జగదీష్ సింగ్ పటానీకి ప్రభుత్వ కమిషన్లో అత్యున్నత పదవి ఇస్తామని హామీ ఇచ్చి ఐదుగురు వ్యక్తుల బృందం ₹25 లక్షలు మోసం చేసిందని పోలీసులు శుక్రవారం వార్తా సంస్థ పిటిఐకి తెలిపారు.
ప్రభుత్వ కమిషన్లో మంచి పదవులు ఇప్పిస్తామని చెప్పి రూ.25 లక్షలు తీసుకున్నారని, తాను మోసపోయానని గుర్తించిన జగదీశ్ సింగ్ యూపీలోని బరేలి జిల్లాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనను మోసం చేసిన ముఠాలో ఐదుగురు వ్యక్తులు ఉన్నట్లుగా గుర్తించారు. శివేంద్ర ప్రతాప్, దివాకర్ గార్గ్, ఆచార్య జయప్రకాశ్, ప్రీతి గార్గ్, మరొకరిపై కేసు నమోదు చేశామని కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ డీకే శర్మ వెల్లడించారు.
జగదీశ్ పటానీ బరేలీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉంటున్నారు. శివేంద్ర ప్రతాప్ సింగ్ తనకు ముందుగానే తెలుసని ఆయన దివాకర్ గార్గ్, జయప్రకాశ్లను పరిచయం చేశారని ఫిర్యాదులో జగదీశ్ పటానీ వివరించారు. తమకు బలమైన రాజకీయ సంబంధాలు ఉన్నాయని నిందితులు తనకు చెప్పారని, ప్రభుత్వ కమిషన్లో చైర్మన్, వైస్ చైర్మన్ లేదా మరో ప్రాధాన్యత కలిగిన పదవిని ఇప్పిస్తామని హమీ ఇచ్చినట్లు అందులో పేర్కొన్నారు. మొత్తం రూ.25 లక్షలు ఇచ్చానని, ఇందులో రూ.5 లక్షలు నగదు రూపంలో, మిగిలిన మొత్తం బ్యాంకు ఖాతాల ద్వారా బదిలీ చేసినట్లు తెలిపారు.
నిందితులు హిమాన్షు అనే "ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ" అంటూ ఒకరిని పరిచయం చేసి తనను తప్పుదారి పట్టించారని కూడా పటానీ పేర్కొన్నారు. ఈ సంఘటన వెనుక మోసం ఉందని పటానీకి అనుమానం రావడంతో, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Next Story