Fri Dec 05 2025 13:14:52 GMT+0000 (Coordinated Universal Time)
నేను, నా కూతురు మానసిక సమస్యలతో.. అమీర్ ఖాన్ వైరల్ పోస్ట్..
నేను నా కూతురు మానసిక సమస్యలతో బాధపడ్డాం అంటూ ఆమీర్ ఖాన్ ఒక వైరల్ వీడియో షేర్ చేశాడు.

ఈమధ్య కాలంలో చాలామంది మానసిక సమస్యలతో ఇబ్బందిపడి, వాటి నుంచి బయటపడలేక కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈక్రమంలోనే ఇటీవల తమిళ నటుడు విజయ్ ఆంటోనీ కూతురు కూడా మరణించినట్లు తెలుస్తుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్.. తను, తన కూతురు మానసిక సమస్యలతో బాధపడినట్లు ఒక వీడియో షేర్ చేశాడు. 'లాల్ సింగ్ చద్దా' సినిమా డిజాస్టర్ తరువాత.. ఆమీర్ ఖాన్ సినిమాలకు బ్రేక్ పలికాడు.
ప్రస్తుతం నటనకు దూరంగా ఉంటూ.. ఫ్యామిలీతో టైం గడుపుతూ వస్తున్నాడు. తాజాగా ఆమీర్, తన కూతురితో కలిసి ఒక వీడియో చేసి పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ఆమీర్ ఖాన్ మాట్లాడుతూ.. "ఏ రంగంలో అయినా ప్రతి మనిషి ఒక సమయంలో మానసిక సమస్యలతో ఇబ్బంది పడతారు. ఆ టైములో వారు దాని గురించి తెలుసుకొని, సరైన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. నేను, నా కూతురు కూడా గతంలో ఇలాంటి మానసిక సమస్యలని ఎదుర్కొన్నాము. అయితే మేము చికిత్స తీసుకోని దాని నుంచి బయటపడ్డాం. మీరు కూడా నా ఈ సలహాని తీసుకుంటారని భావిస్తున్నాను" అంటూ పేర్కొన్నాడు.
కాగా ఆమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ కొన్నాళ్ల క్రితం 'అగాట్సు' అనే ఫౌండేషన్ స్థాపించింది. ఈ ఫౌండేషన్ లో మానసిక సమస్యలు ఎదుర్కునే వాళ్ళకి చికిత్స ఇస్తూ సేవలు అందిస్తూ వస్తుంది. ఈనేపథ్యంలోనే మానసిక సమస్యలు ఉన్నవారు తమని సంప్రదించండి అంటూ.. ఆమీర్ తన కూతురితో కలిసి ఈ వీడియో చేశాడు. అందుకోసం కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ ని కూడా ఐరా ఖాన్ షేర్ చేసింది. ఇక ఈ విషయంలో నెటిజెన్స్.. ఆమీర్ అండ్ ఐరాని అభినందిస్తున్నారు.
Next Story

