Thu Dec 18 2025 07:36:37 GMT+0000 (Coordinated Universal Time)
నటుడు విజయ్ సేతుపతిపై క్రిమినల్ కేసు నమోదు
తమిళ నటుడు విజయ్ సేతుపతిపై క్రిమినల్ కేసు నమోదైంది

తమిళ నటుడు విజయ్ సేతుపతిపై క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. గత నెలలో బెంగళూరు విమానాశ్రయంలో విజయ్ సేతుపతి, ఆయన మేనేజర్ జాన్సన్‌తో మహా గాంధీ అనే వ్యక్తికి గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఇది అక్కడితే సద్దుమణిగిందనుకుంటే పొరపాటే. ఇప్పటికే మహాగాంధీ అనే వ్యక్తి విజయ్ పై పరువునష్టం దావా కూడా వేశాడు. తాజాగా అతను విజయ్ సేతుపతిపై క్రిమినల్ కేసు కూడా పెట్టాడు. మహాగాంధీ చెప్పిన వివరాల మేరకు నవంబర్ 2వ తేదీన తాను మెడికల్ చెకప్ నిమిత్తం మైసూర్ వెళ్తుండగా.. బెంగళూరు విమానాశ్రయంలో విజయ్ ను కలిసినట్లు తెలిపారు.
మాట్లాడేందుకు ప్రయత్నించగా...
వృత్తి రీత్యా తాను కూడా నటుడే కావడంతో.. విజయ్ సేతుపతితో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ఆయన తనపై చేయిచేసుకున్నట్లు పిటిషన్ లో పేర్కొన్నాడు. 'సూపర్ డీలక్స్' చిత్రానికి గానూ విజయ్‌కి ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారం లభించినందుకు తాను ప్రశంసిస్తే.. విజయ్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా.. తన కులాన్ని కించపరిచేలా మాట్లాడినట్లు పిటిషనర్ పేర్కొన్నాడు. ఈ దాడిలో తన చెవికి దెబ్బ తగలడంతో వినికిడి సమస్య తలెత్తిందని తెలిపాడు. ఈ వివరాలతో మహా గాంధీ విజయ్, అతని మేనేజర్ జాన్సన్‌లపై చెన్నైలోని సైదాపేట కోర్టులో కేసు వేసి, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసు త్వరలోనే విచారణకు వచ్చే అవకాశం ఉందని పిటిషనర్ తెలిపాడు.
Next Story

