స్పీడుతో పిచ్చెక్కిచ్చేస్తున్నాడు

ఏడాది కి రెండు మూడు సినిమాలతో దూసుకుపోతున్న హీరో నాని వరుసగా సినిమాలు లైన్ లో పెట్టేస్తూ స్టార్ హీరోలకు పిచ్చెక్కించేస్తున్నాడు. నాని అలా సినిమాలు చేసుకుంటూ హిట్స్ కొట్టేస్తుంటే మాత్రం స్టార్ హీరోలు పైకి ఏడవలేక నవ్వుతున్నారు. వారైతే భారీ బడ్జెట్ తో ఏడాదికి ఒక సినిమానే విడుదల చెయ్యడానికి నానా తంటాలు పడుతూ... ఆ సినిమా హిట్ అవుతుందో? లేదో అనే టెన్షన్ తో కొట్టుమిట్టాడే వారికి, నాని వరుస సినిమాలు, వరుస హిట్స్ గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. కానీ నాని మాత్రం రేసుగుర్రంలా దూసుకుపోతున్నాడు.
ఒక చిత్రాన్ని విడుదలచేయకముందే మరో చిత్రాన్ని లైన్ లో పెట్టేస్తున్న నాని 'నిను కోరి' చిత్రం అలా విడుదలైందో లేదో ఇలా 'ఎంసీఏ' షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం నాని, దిల్ రాజు నిర్మాణంలో 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని కంప్లీట్ చేసుకుని డిసెంబర్ మొదటి వారంలో థియేటర్స్ లోకి దిగిపోనుంది. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే... మేర్లపాక గాంధీ డైరెక్టన్ లో 'కృష్ణార్జున' చిత్రాన్ని ఫైనల్ చెయ్యడమే కాదు... 'కృష్ణార్జున' షూటింగ్ ని ఆఫిసియల్ గా అనౌన్స్ చేసేసాడు.
నాని ఈ 'కృష్ణార్జున' చిత్రం కోసం ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఒక బైక్ మీద కృష్ణుడి ఫ్లూట్ పెట్టుకుని వెళ్తున్న ఫోటోను ఒకటి షేర్ చేస్తూ.. ఈ సినిమా షూటింగ్ మొదలైందని చెప్పకనే చెప్పాడు నాని. ఇక ఈ చిత్రంలో 'అ... ఆ' ఫేమ్ అనుపమ పరమేశ్వరన్ నటిస్తుందని టాక్ బాగా వినబడుతుంది. ఇక అనుపమ ఒక హీరోయిన్ గా 'కృష్ణార్జున' లో ఫైనల్ అయితే మరో హీరోయిన్ ని కూడా ఈ సినిమా కోసం ఫైనల్ చెయ్యాల్సి ఉంటుంది.

