సూపర్ పబ్లిసిటీ కదా?

విజయ్ దేవరకొండ నటించిన 'అర్జున్ రెడ్డి' ఈ శుక్రవారమే విడుదలై సంచలన విజయం నమోదు చేసింది. విజయ్ దేవరకొండ కెరీర్ లో మూడో సినిమాతోనే బెస్ట్ ఓపెనింగ్స్ తో ఈ చిత్రం నిలిచిందనడంలో ఎటువంటి సందేహం లేదు. 'అర్జున్ రెడ్డి' మార్నింగ్ షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాదు క్రిటిక్స్ నుండి కూడా మంచి మార్కులు వేయించుకుంది. ఈ చిత్రంలోని విజయ్ దేవరకొండ నటనకు యూత్ అంతా జేజేలు పలుకుతున్నారు. మరి ఈ సినిమా 'ఏ' సర్టిఫికెట్ పొందినప్పటికీ చిత్ర టీమ్ ఎటువంటి జంకు బొంకు లేకుండా ఈ చిత్రాన్ని విడుదల చేసింది. ఇక ఈ చిత్రంలో హీరోగా ఇరగదీసిన విజయ్ యూత్ కి ఐకాన్ లా కనిపిస్తున్నాడంటూ కుర్రకారు రెచ్చిపోయే కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమా విడుదలకు ముందు ముద్దు సీన్స్ పోస్టర్స్ పై రచ్చ జరిగిన విషయం విదితమే. మహిళా సంఘాలు 'అర్జున్ రెడ్డి' పోస్టర్స్ పై రచ్చ చెయ్యడం ఏమోగానీ కాంగ్రెస్ నేత వీహెచ్, అలాగే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మధ్యన జరిగిన ట్విట్టర్ లో మాటల యుద్ధం అందరికి తెలిసిందే. ఇక సినిమా విడుదలైన తర్వాత సినిమా చూసాక వర్మగారు వీహెచ్ ని ఉధేషించి ట్విటర్ లో వీహెచ్ కి తాను ముద్దు పెడుతున్న ఫొటోస్ పోస్ట్ చేసాడు. ఆ ఫోటోని వర్మ గారు మార్ఫింగ్ చేసి మరి పోస్ట్ చేసాడు.
ఇక వర్మ గారు అక్కడితో వదలకుండా విజయ్ దేవరకొండని తెలంగాణాకి మెగాస్టార్ ని చేసేసాడు. తెలంగాణ స్టేట్ సపరేట్ అయ్యాక సినిమాపరిశ్రమనుండి మెగాస్టార్ ఎవరైనా ఉన్నారంటే అది విజయ్ దేవరకొండ మాత్రమే అంటూ డప్పు వాయిస్తున్నాడు. ఇప్పటివరకు ఏ యంగ్ హీరో చెయ్యని సాహసం 'అర్జున్ రెడ్డి' లో విజయ్ చేసాడంటున్నాడు. ఈ తరం హీరోలంతా కేవలం ర్యాంపింగ్ షాట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లపైనే ఆధారపడుతున్నారని.. అలాంటివాటిపై ఆధారపడకుండా హీరోయిజాన్ని చూపించిన హీరో విజయ్ అంటూ విజయ్ మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడు వర్మ.
అయితే అలంటి విషయాల్లో బాలీవుడ్ నటుడు అమితాబ్ తర్వాత తెలంగాణ హీరో విజయ్ కనిపిస్తున్నాడంటూ.... యంగ్ అమితాబ్, యంగ్ ఆల్-పాచినోను కలిపితే విజయ్ దేవరకొండ అంటూ స్టేట్మెంట్ లు ఇచ్చేస్తున్నాడు. మొత్తానికి 'అర్జున్ రెడ్డి' హీరోని రామ్ గోపాల్ వర్మ మునగచెట్టు ఎక్కించడమే కాదు.... ఈ సినిమాకి ఫ్రీ గా పబ్లిసిటీ చేసిపెట్టాడంటూ కొంతమంది సెటైర్స్ కూడా వేస్తున్నారు.

