వెండితెరపై కేసీఆర్ జీవితం!

వెండితెర ప్రపంచంలో మహామహులు, యోధుల జీవితకథలను చిత్రించే పోకడ ముమ్మరంగా నడుస్తోంది. ఇటీవలి కాలంలో జీవితకథల ఆధారంగా నిర్మించిన అనేక చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఘన విజయాల్ని నమోదు చేశాయి. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు, ప్రత్యేకించి తెలంగాణ ప్రజలకు ఎంతో ఆసక్తికరమైన , ఉద్యమకారుడు కేసీఆర్ జీవితాన్ని వెండితరపై ఆవిష్కరించే ప్రయత్నం కూడా జరుగుతోంది. తెలంగాణ ఉద్యమానికి నేతృత్వం వహించి ప్రత్యేక రాష్ట్రం కలను సాకారం చేసిన కేసీఆర్ జీవితం వెండితెరపై ఆవిష్కృతం కానుంది. ముఖ్యమంత్రి జీవితకథను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు డైరెక్టర్ మధుర శ్రీధర్. వచ్చే ఏడాది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున షూటింగ్ ప్రారంభించి.. కేసీఆర్ పుట్టినరోజు కానుకగా దీన్ని విడుదల చేయాలనుకుంటున్నాడు.
తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచీ.. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ దీక్ష చేసి.. తెలంగాణ ఇచ్చేలా అప్పటి కేంద్రంలో కదలిక తీసుకొచ్చాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆ ఉద్యమ గాథనే చలనచిత్రంగా మలచబోతున్నాడు దర్శకుడు మధుర శ్రీధర్. ధర్మపథ క్రియేషన్స్ బ్యానర్‌పై రాజ్ కందుకూరి ఈ సినిమాను నిర్మించనున్నాడు.
కేసీఆర్ పై తీయబోయే సినిమా గురించి దర్శకుడు శ్రీధర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశయాలను, కలలను మహా నాయకుడు కేసీఆర్ నిజం చేశారన్నాడు. కేసీఆర్ వల్లే దేశం మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని సానుకూల ధోరణితో చూసిందన్నాడు దర్శకుడు శ్రీధర్. గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, మండేలాకు తీసిపోని క్లిష్టమైన సవాళ్లను ఆయన ఎదుర్కున్నారని తెలుసుకున్నాకే.. ఈ ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ అన్ని అంశాలపై పరిశోధన చేస్తున్నారు దర్శకుడు మధుర శ్రీధర్. వచ్చే ఏడాది జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నాడు. చిత్రీకరణ పూర్తి చేసి.. 2018 ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టినరోజు కానుకగా తెలంగాణ ప్రజలకు తన చిత్రాన్ని అందించాలని ప్లాన్ చేస్తున్నాడు.

