వృద్దాప్యంలోనూ వైవిధ్యాన్ని వీడని సూపర్ స్టార్

ఆకాశవాణి లో ఉద్యోగానికి ప్రయత్నించి అనర్హుడివి అని ఛీ కొట్టించుకుని, ఎన్నో కష్టాలను అధిగమించి యవ్వన వయసులోనే అద్భుత నటుడిగా గుర్తింపుని, కోట్ల భారతీయుల అభిమానాన్ని సంపాదించుకుని, బుల్లి తెర మీద తనకి తానే పోటీ అని నిరూపించుకుని, నేటికీ 73 ఏళ్ళ వయసులోనూ తనకి ప్రత్యేకమైన పాత్రలు తయారు అయ్యేలా తన నటనతో నేటి తరం దర్శక రచయితలకు ప్రేరణ కల్పిస్తున్న అమితాబ్ బచ్చన్ నేటి తరం నటులకి ధీటుగా తన విజయ పరంపర కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఆయన నటిస్తున్న చిత్రాలు రెండు లేక అంతా కన్నా ఎక్కువ విడుదల అవుతుండటం విశేషం.
డిపార్ట్మెంట్, బొంబాయి టాకీస్, సత్యాగ్రహ, భూతనాథ్ రిటర్న్స్, షమితాబ్, పీకు, వాజిర్, తీన్, పింక్ ఇలా వరుసగా ఆయన పోషించిన ఒక పాత్రకు మరో పాత్రకు పోలిక కనిపించదు. తాజాగా ఆయన ముంబై డబ్బావాలా గా కనిపించబోతున్నట్టు సమాచారం. ప్రదీప్ సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న డబ్బాగుల్ చిత్రంలో ఆయన ఈ పాత్ర పోషించబోతున్నారు. ముంబై నగరంలో అనేక ఆఫీసులలో పనిచేసే ఉద్యోగులకు లంచ్ కారియర్లు అందించే డబ్బావాలాల జీవిత నేపధ్యంలో సాగే చిత్రం డబ్బాగుల్. ఈ చిత్రం 2017 లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
మరో వైపు బిగ్‌బీ తన తదుపరి చిత్రంగా తగ్స్ అఫ్ హిందుస్థాన్ అనే చిత్రం లో ఆమిర్ ఖాన్ తో కలిసి నటించబోతున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యాష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుండగా, ధూమ్ 3 చిత్ర దర్శకుడు విజయ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు.

