విజయ్ మరణం వెనక....?

సినీ హాస్య నటుడు విజయ్ ఆత్మహత్య టాలీవుడ్ ను కుదిపేసింది. ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న విజయ్ ఆత్మహత్య తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. భార్యతో ఏర్పడిన తగాదాలే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని విజయ్ తల్లిదండ్రులు ఆరోపించారు. కేసు నమోదు చేసిన జూబ్లిహిల్స్ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.
ఎనిమిదేళ్ల క్రితమే వివాహం...
తెలుగు సినీ పరిశ్రమ మరోసారి దిగ్బ్రాంతికి గురైంది. పలు సినిమాల్లో హాస్యనటుడుగా నటించిన విజయ్ ఆత్మహత్య పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆత్మహత్యకు కుటుంబ తగాదాలే కారణమని తెలుస్తోంది. ఉదయం తన తండ్రి సుబ్బారావుతో మాట్లాడిన తరువాత తన గదిలోకి వెళ్లిన అతను ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని తలుపులు బద్ధలు కొట్టి లోపలికి ప్రవేశించారు. అప్పటికే విజయ్ డెడ్ బాడీ ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. విజయ్ ఆత్మహత్యపై మొదట అందరూ ఆర్థిక ఇబ్బందులు అని భావించారు. సినిమాల్లో అవకాశాలు లేక చనిపోయాడని భావిస్తున్న తరుణంలో ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు అందరిని విస్మయానికి గురి చేసింది. 8 సంవత్సరాల కిందట వనిత అనే యువతిని విజయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మొదట్లో అతని వివాహం నచ్చకపోయినా తల్లిదండ్రులు అతని కోరిక కాదనలేక పోయారు. వీరికి ఒక పాప కుందన కూడా పుట్టింది. యూసఫ్ గూడలోని సాయి కళ్యాణ్ అపార్ట్ మెంట్ లో స్థిరనివాసం ఏర్పరుచుకున్నాడు. బొమ్మరిల్లు. అబ్బాయిలు..అమ్మాయిలు సిినిమాలలో హాస్యనటుడుగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ సినీ పరిశ్రమలో తనదైన ముద్రవేసుకున్నాడు. తదనంతరం బెస్ట్ కమెడియన్ గా టాలీవుడ్ లో పేరు తెచ్చుకొని అతి తక్కువ సమయంలో చాలా సినిమాల్లో నటించాడు.
కుటుంబ తగాదాలు....
అనుకోని పరిస్థితిలో విజయ్ కుటుంబంలో కూడా కలతలు మొదలైనాయి. భార్య వనితతో విబేధాలు తలెత్తాయి. దీంతో మూడు సంవత్సరాల కిందట తన కూతురు కుందనను తీసుకొని వెళ్లిపోయింది. భర్తకు దూరంగా ఉండటమే కాకుండా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తనకు ఎదురైన అనుభవం అతను తట్టుకోలేక పోయాడు. ఈ విషయం నలుగురి తెలిసే సరికి తలెత్తుకోలేక.. సినీ పరిశ్రమకు కొంత దూరంగా ఉంటూ కోర్టును ఆశ్రయించడమే కాకుండా తన కుటుంబ సభ్యులు, న్యాయవాది తో వనిత నిత్యం వేదిస్తూ ఉండేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆదివారం రాత్రి కూడా తన బంధువులతో కలిసి వచ్చిన వనిత ఇంట్లో ఉన్న బంగారం, కారుతో వెళ్లిపోయింది. ఈ తతంగం అంతా స్తానిక అపార్ట్ మెంట్ వాసులు చూసేసరికి విజయ్ సిగ్గుతో కుంగిపోయాడు. సోమవారం ఉదయం ఒంగోలు నుండి యూసఫ్ గూడలో సాయి కళ్యాణ్ అపార్టుమెంట్ లో నివసించే తన కొడుకు ఇంటికి వచ్చిన తండ్రి సుబ్బారావుతో విజయ్ జరిగిన విషయం చెప్పాడు.
భార్యతో గొడవలే....
ఆ తరువాత 10.30 గంటల ప్రాంతంలో తన గదిలోకి వెళ్లి లోపలి నుండి గడియపెట్టుకున్నాడు. ఇంతలో ఇంటికి వచ్చిన విజయ్ స్నేహితుడు తలుపులు తట్టినా ఎంతకీ తీయకపోవడంతో అనుమానం వచ్చి జూబ్లిహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన స్పాట్ కు చేరుకున్న పోలీసులు తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి ఫ్యానుకు వేలాడుతూ విజయ్ డెడ్ బాడీ కనిపించింది. అంతే ఒక్కసారిగా షాక్ కు గురైన తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమైనారు.తన కొడుకు ఆత్మహత్యకు భార్య వనితే కారణమని పోలీసులకు విజయ్ తల్లిదండ్రులు, బంధువులు ఫిర్యాదు చేశారు. నిత్యం ఆమె తన భర్తతో గొడవ పడేదని రాత్రి కూడా తన మనుషులతో వచ్చి బంగారం, కారు తీసుకొని వెళ్లడం తాము చూశామంటూ స్థానికులు సైతం పోలీసులకు వివరాలందించారు. మొత్తానికి ప్రేమించి.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న విజయ్ జీవితం.. పెళ్లి విషయంలో కుటుంబ సభ్యుల వద్ద రాజీ చేసుకున్న కలహాల కాపురంలో మాత్రం రాజీ పడలేక ఆత్మహత్యే శరణమనుకున్నాడు.
- Tags
- విజయ్

