వామ్మో ఇలియానా పెద్ద షాకే ఇచ్చిందిగా?

గోవా హాట్ భామ ఇలియానా ను దేవదాసు అనే సినిమాతో వైవిఎస్ చౌదరి పరిచయం చేశారు. ఆ సినిమా పెద్ద విజయం సాధించకపోయినా ఇలియానా అందాల మీద మాత్రం నిర్మాత, దర్శకుల కళ్ళు పడిపోయాయి. ప్రేక్షకులు కూడా ఇలియానా అందాలను మరొక్కసారి తెరమీద చూస్తే చాలు అనుకున్నారు. 2006లో తెలుగు సినిమా రంగానికి పరిచయమైన ఇలియానా ఆ తరువాత పెద్ద హీరోలందరితోనూ నటించింది. పోకిరి, ఖతర్నాక్, రాఖీ, మున్నా, ఆట, జల్సా, భలే దొంగలు, కిక్, రెచ్చిపో, సలీం, శక్తి, జులాయి, దేవుడు చేసిన మనుషులు చిత్రాల్లో ఇలియానా వివిధ పాత్రల్లో హాట్ హాట్ గా నటించింది.
2012 తరువాత ఇలియానా తెలుగు చిత్ర రంగానికి దాదాపుగా గుడ్ బై చెప్పేసింది. తెలుగు సినిమా ఒక ప్రాంతానికి పరిమితమైంది కాబట్టి ఆమె దృష్టి హిందీ రంగం మీద పడింది. ఇలియానా అందచందాలే కాకుండా ఆమెలో ఉన్న చక్కటి నటిని కూడా హిందీ చిత్ర రంగం గుర్తించింది. అందుకే క్రమంగా తన మకాంను కూడా ముంబైకి మార్చేసింది ఇలియానా. ఇలియానా గత కొంతకాలంగా ఆస్ట్రేలియాకు చెందిన కెమెరా మెన్ ఆండ్రు నిబోన్ తో ప్రేమలో పడిందని, అతనితో చెట్టపెట్టలేసుకుంటూ గోవా బీచ్ తో పాటు విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా చాలామంది కళ్ళల్లో పడింది. అయితే అతన్ని పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పిందే తప్ప అధికారికంగా ప్రకటించలేదు.
ప్రతి ఏడు ఈ గోవా సుందరి క్రిస్మస్ పెద్ద పండగను గోవాలో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటుంది. ఎన్ని పనులున్నా, షూటింగులున్నా ఇలియానా క్రిస్మస్ కు తప్పకుండా గోవా వెళ్లాల్సిందే. అక్కడ కుటుంబ సభ్యులతో సెలెబ్రేట్ చేసుకోవాల్సిందే. అయితే ఈ సంవత్సరం క్రిస్మస్ సెలబ్రేషన్ ముందు రెడ్ గౌన్ వేసుకుని క్రిస్మస్ ట్రీ ని అలంకరిస్తున్న ఫోటోను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటో స్వయంగా తన భర్త ఆండ్రు నిబోన్ తీశాడని పేర్కొనడం విశేషం.
ఇప్పటి వరకు మిస్ ఇలియనాగా ఉండి యువకుల కలల రాణిగా ఉన్న ఈ తార ఇకనుంచి మిసెస్ కావడం చాలామందికి నచ్చే విషయం కాదు. ఈ నిజాన్ని తనకిష్టమైన క్రిస్మస్ పండుగ రోజున ఇలియానా వెల్లడించడం మాత్రం పండుగ స్పెషలే.

