వర్మ కి జైలు తప్పదా?

జిఎస్టీ పేరుతో రాంగోపాల్ వర్మ నిర్మించిన పోర్న్ వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అతన్ని శిక్షించాలంటూ మహిళా సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు రామ్ గోపాల్ వర్మకు నోటీసులిచ్చి ఈరోజు విచారణకు హాజరు కావాలని చెప్పారు.
నోటీసులు తీసుకునేందుకు రామ్ గోపాల్ వర్మ అంగీకరించలేదు. తాను షూటింగ్ బిజీలో ఉన్నానని, తర్వాత హాజరవుతానని తన లాయర్ తో చెప్పించారు. వచ్చే వారం తాను హాజరయ్యే అవకాశం ఉందని రామ్ గోపాల్ వర్మ చెప్పడంతో పోలీసులు వర్మకు మళ్ళీ నోటీసులు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. జీఎస్టీ విడుదల సందర్భంగా హైదరాబాద్ లో మహిళా సంఘాల నేతలను ఉద్దేశించి అభ్యంతరకరమైన భాషలో మాట్లాడడం వల్లనే వారంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మహిళల ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకొని విచారణకు హాజరుకావాలని వర్మకు నోటీసులిచ్చారు. వర్మను విచారించడానికి అదుపులోకి తీసుకుంటే అతనిపై పెట్టిన సెక్షన్ల ప్రకారం జైలుకెళ్లే అవకాశం ఉందని లాయర్లు చెబుతున్నారు.

