రిలీజ్ టెన్షన్ లో ఎక్కువ స్మోక్ చేస్తున్నాట్ట

ప్రతి చిత్రం తెరపై ప్రదర్శన మొదలు కావటానికి ముందు కథానాయకుడి వాయిస్ ఓవర్ తో ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే మాటలు వినపడుతుంటాయి. కానీ ఎంత మంది కథానాయకులు నిజ జీవితంలో ధూమపానానికి, మద్యపానానికి దూరంగా వుంటున్నారు అనే ప్రశ్న ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉంటుంది. అయితే ఎంత మంది కథానాయకులు వారి వారి బలహీనతల్ని బహిరంగంగా ఒప్పుకునే సాహసం చేయగలరు? మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఆ సాహసం చేసాడు. ఆమిర్ ఖాన్ తన శరీరాన్ని చాలా ఒత్తిడికి గురి చేసి పాత్రల వ్యత్యాసం కనపరచటానికి అధిక బరువు పెరగటం తిరిగి రోజుల వ్యవధిలోనే బరువును తగ్గటం చేసి దంగల్ చిత్రీకరణ పూర్తి చేసి ఇప్పుడు ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు.
గత రెండు సంవత్సరాలుగా ధూమపానానికి దూరంగా ఉంటున్న ఆమిర్ ఖాన్ ఇప్పుడు తరచుగా పొగ తాగుతున్నాడు అంట. ఈ విషయం స్వయంగా ఆమిర్ ఖానే వెల్లడించటం గమనార్హం. "గత కొన్ని సంవత్సరాలుగా ధూమపానం పూర్తిగా మానేసాను కానీ ఇప్పుడు దంగల్ చిత్ర విడుదల కి ముందు ఒత్తిడి తట్టుకోలేక మళ్లీ పొగాకు బానిసగా మారిపోయాను. ప్రతి చిత్రంపై ఎన్నో ఆశలతో చాలా కష్టపడి పని చేస్తుంటాం. దానితో విడుదలకి ముందు ఫలితంపై తీవ్ర ఆందోళన కలుగుతుంటుంది. ఆ ఆందోళన నుంచి ఉపశమనం కోసం పొగాకు కి చేరువ అవుతుంటాను. మళ్లీ విడుదల తరువాత ధూమపానం మానేస్తాను. నా తదుపరి చిత్రంలో నా నటన పై ఈ ప్రభావం కనపడకుండా జాగ్రత్తలు కూడా వహిస్తాను." అని సెలవిచ్చాడు మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్.
ఆమిర్ ఖాన్ రెస్ట్లెర్ పాత్రలో నటించిన దంగల్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 23 వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే యూట్యూబ్ లో ప్రచార చిత్రాలకు మంచి స్పందన వస్తుండటంతో పాటు సినిమా పై అంచనాలు కూడా భారీగా పెంచాయి.

