రాజు గారి నమ్మకం హైప్ కోసమేనా?

మెగా స్టార్ చిరంజీవి సోదరుడిగా ప్రేక్షకులకి పరిచయమైన కథానాయకుడు పవన్ కళ్యాణ్ కి సొంత ఐడెంటిటీ తెచ్చిన చిత్రం 'తొలి ప్రేమ'. దాదాపు రెండు దశాబ్దాల క్రితం విడుదలైన తొలిప్రేమ చిత్రాన్ని కళ్యాణ్ అభిమానులే కాదు, సగటు సినిమా అభిమాని కూడా మర్చిపోలేదు. తొలి ప్రేమ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ లో అంత ప్రత్యేకమైన చిత్రం. అలాంటి తొలిప్రేమ చిత్ర టైటిల్ ని మెగా హీరో వరుణ్ తేజ్ తన చిత్రం కోసం వాడుకుని చాలా పెద్ద సాహసమే చేస్తున్నాడు. అందులోనూ వెంకీ అట్లూరి అనే నూతన పరిచయ దర్శకుడి చిత్రానికి కావటం విశేషం. అయితే తొలిప్రేమ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన కరుణాకరన్ కూడా ఆ చిత్రంతో పరిచయమైన వారేనని మనం మర్చిపోలేం అనుకోండి.
వరుణ్ తేజ్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎం.ప్రసాద్ నిర్మించిన తొలిప్రేమ కి అదనపు ఆకర్షణ, ప్రధాన బలం గా దిల్ రాజు నిలుస్తున్నారు. ఆయన ఈ చిత్రాన్ని మొత్తానికి థియేట్రికల్ రిలీజ్ రైట్స్ ని దక్కించుకున్నారు. ముందుగా ఈ చిత్ర కథ తన దగ్గరకే వచ్చిందని, అప్పటికి వేరే సినిమాతో బిజీగా ఉండటంతో నిర్మించలేకపోయిన తాను ఈ సినిమా చూసిన అనంతరం మొత్తానికి సినిమా హక్కులు దక్కించుకున్నట్టు చెప్తున్నారు దిల్ రాజు. అయితే ఇలాంటి మాటలే గత ఏడాది జవాన్ చిత్రానికి చెప్పి ఆ చిత్ర హైప్ కి కారణమయ్యాడు దిల్ రాజు. కానీ ఆ చిత్రం మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో మరో వైఫల్యం గా నిలిచింది. మరి ఈ సారి వరుణ్ తేజ్ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.