రాజమౌళి ఫాంటసీ ప్రయత్నించనంటున్న దర్శకుడు

బాహుబలి చిత్రంతో రాజమౌళి పేరు యావత్ భారత దేశం జపిస్తుంది. ఏ దర్శకుడు ఇంటర్వ్యూ ఇచ్చినా విలేకరులు రాజమౌళి ప్రస్తావన ఇతర దర్శకుల దగ్గర తెచ్చి పోలిక, పోటీ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాగా రాజమౌళి శైలికి పూర్తి భిన్నమైన శైలి లో చిత్రాలు తెరకెక్కించే దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కి ఇదే తరహా సంఘటన ఎదురు ఐయ్యింది. సాహసం శ్వాసగా సాగిపో చిత్రం విడుదల తరువాత చిత్ర ప్రచార కార్యక్రమాలు కొనసాగిస్తున్న గౌతమ్ మీనన్ మీడియా వారికి తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ లో ఒక విలేకరి గౌతమ్ ని బాహుబలి తరహా చిత్రాన్ని మీరు ప్రయత్నిస్తారు అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న కు కొంచం సుదీర్ఘ వివరణ ఇచ్చాడు గౌతమ్ వాసుదేవ్ మీనన్.
"నేను నా చిత్రాలను చాలా సహజంగా ఉండేలా చూసుకుంటాను. ప్రేమ కథ అయినా, క్రైమ్ కథ అయినా, లైఫ్ డ్రామా అయినా ప్రేక్షకులు తమ స్వీయ అనుభవం గా తెరపై జరుగుతున్న కథకి కనెక్ట్ అవ్వాలనేది నా తాపత్రయం. రాజమౌళి గారు బాహుబలి చిత్రాన్ని ఫాంటసీ గా తీశారు. నేను అటువంటి ఫాంటసీ జోలికి వేళ్ళను. నేను అటువంటి చిత్రాలు తీయటమే కాదు కదా థియేటర్లో కూర్చుని చూడటానికి కూడా నేను ఫాంటసీ ని ఆస్వాదించలేను. పైగా అంతటి భారీ వ్యయం ఒక చిత్రం పై పెట్టించే ధైర్యం కూడా నేను చెయ్యలేను." అంటూ రాజమౌళి శైలిని విమర్శించకుండా తన శైలిని సమర్ధించుకున్నారు గౌతమ్ వాసుదేవ్ మీనన్.

