యంగ్ టైగర్ కి స్పష్టత వచ్చేది ఎప్పుడు?

ప్రస్తుత తరం తెలుగు కథానాయకులలో అన్నీ వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందగలిగిన, వైవిధ్యమైన పాత్రలు పోషించగలిగే అరుదైన నటులలో కచ్చితంగా అగ్ర స్థానం తారక్ సొంతం. అతి పిన్న వయసులో యమ ధర్మ రాజు పాత్ర పోషించిన నటుడిగా చరిత్రలో నిలిచిపోయాడు తారక్. కానీ తారక్ స్టామినా నిరూపించుకునే రికార్డ్స్ మొన్నమొన్నటి వరకు సృష్టించలేకపోయాడు. ఇటీవల విడుదల ఐన తారక్ చిత్రం జనతా గ్యారేజ్ ఆయన కెరీర్ ట్రాక్ రికార్డు గా నిలవటమే కాక తెలుగు చలన చిత్రాలలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మూడవ స్థానం సంపాదించుకుంది.
ఈ భారీ విజయమే తారక్ ని తదుపరి చిత్రానికి కథ ఎంపిక విషయంలో సందిగ్ధంలో పడేసింది. వరుసగా కథలు వింటున్న తారక్ మరే చిత్రాన్ని అంగీకరించలేదు. పూరి జగన్నాథ్, వక్కంతం వంశి, అనిల్ రావిపూడి, హరి వంటి ప్రముఖులు చెప్పిన కథలు విని తిరస్కరించటం జరిగిపోయింది. ఒకప్పుడు సింహాద్రి వంటి బ్లాక్ బస్టర్ తరువాత వరుస వైఫల్యాలు ఎదురు ఐన చేదు అనుభవం పునరావృతం కాకూడదు అని జాగ్రత్తలు వహిస్తున్న తారక్ కి తదుపరి చిత్రం పై స్పష్టత వచ్చేది ఎప్పుడో మరి... మరో పక్క తన సమకాలీన కథానాయకుల ఏడాదికి రెండేసి చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తుంటే కథ చర్చలతో ఇంత కాలం గడిపేస్తున్న తారక్ విజయాలు అందుకున్నా అగ్ర స్థానం దక్కించుకోవటం కష్టమని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

