మహేష్ పై పదే పదే పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్న పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ బలోపేతం కోసం సాగిస్తున్న ప్రత్యేక యాత్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమై దిగ్విజయంగా రెండవ రోజు ఖమ్మం జిల్లా లో పలు సభలతో ప్రజాకర్షణ పొందింది. చాలా ఉత్తేజభరితంగా సాగిన పవన్ కళ్యాణ్ స్పీచ్ లో ఆయన పలు మార్లు తనకి, తన పార్టీ కి యువతలో వుండే ఉడుకు రక్తం జోరు కావాలని చెప్తూనే, తాను పని చేసేది గడిచిన తరం కోసం కాదని, భావి తరాల కోసం అని స్పష్టం చేశారు. ఇదే ఆసక్తికర ఉపన్యాసంలో ఆయన పదే పదే కలిపించుకుని మరీ ఒక వ్యాఖ్య చేస్తూ వచ్చారు.
"రాజకీయాలలోకి వచ్చి ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధపడిన నన్ను విమర్శిస్తుంటారు. తిడుతుంటారు. రాళ్లు వేస్తుంటారు. వాటన్నిటిని మౌనంగా భరించే శక్తి నాకుంది. నా పై ఎవరు ఎలాంటి బురద జల్లే ఆరోపణలు చేసినా వాటికి సమాధానమిస్తూ స్పందిస్తూ నేను సమయం వృధా చేసుకునే కంటే అవి అలా వదిలేసి ప్రజా సమస్యల పరిష్కారానికే కృషి చేస్తాను. మీరు కూడా అలానే మౌనంగా భరించండి. ఎదురు దాడితో విచక్షణ కోల్పోవద్దు." అంటూ అభిమానులకి తన ఉపన్యాసంలో పదే పదే పిలుపు నిచ్చిన కళ్యాణ్ వ్యాఖ్యలు పరోక్షంగా కత్తి మహేష్ వ్యవహారం పై చేసిన వ్యాఖ్యలుగా అనిపించక మానవు.