మళ్లీ గాయాన్ని రేపొద్దు

తెలుగు సినిమాలో ఐటెం సాంగ్ కి గ్లామర్ పెరగటానికి, ఇంత క్రేజ్ రావటానికి వెనుక వున్న అనేక కారణాలలో ముమైత్ ఖాన్ ప్రధాన కారణంగా నిలుస్తుంది అనటంలో అతిశయోక్తి లేదు. ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పోకిరి చిత్రంలో ని ఐటెం సాంగ్ తో ఎనలేని గుర్తింపు తెచ్చుకున్న ముమైత్ ఖాన్ తెలుగులోనే ఐటెం గర్ల్ నుంచి ప్రధాన పాత్రలకి ప్రమోట్ ఐయింది కానీ ఆ ప్రయత్నాలు పెద్దగా సత్ఫలితాలు ఇవ్వకపోవటంతో కొంత కాలానికే కనుమరుగైపోయింది.
ఇటీవలి కాలంలో చిత్ర పరిశ్రమని కుదిపేసిన డ్రగ్ మాఫియా వ్యవహారం లో అనుమానితుల జాబితాలో వున్న ముమైత్ సిట్ విచారణ ఎదుర్కోవటానికి హాజరైన సమయంలో ప్రఖ్యాత టెలి షో బిగ్ బాస్ లో పార్టిసిపెంట్ గా వున్న సంగతి విదితమే. తాజాగా ముమైత్ ఖాన్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ సిట్ విచారణ గురించి ప్రశ్నించగా, "ఎలాంటి ఆధారాలు లేకుండా, కేవలం అనుమానితులం అనే సాకుతో మమ్మల్ని విచారణ అని పిలిచి మానసిక క్షోభకి గురి చేసి వారు మాత్రం తమ పని తాము చేసుకోవటానికి అందరూ సహకరించాలని పదే పదే చెప్పిన సిట్ అధికారులు విచారణ పూర్తయి ఇన్ని నెలల తరువాత కూడా వారి నివేదికని ఎందుకు మీడియా ముందు వుంచలేకపోతున్నారు? ఏ తప్పు చేయని మమ్మల్ని మాత్రం విచారణ ఎదుర్కొనేందుకు రావలసిందిగా మీడియా సాక్షిగా నోటీసులు ఇచ్చారు. ఇది ఎంత వరకు న్యాయం? సిట్ అధికారులు మాకు చేసిన మానసిక గాయం ఇంకా నరకం చూపిస్తూనే వుంది. బాధ్యతాయుతమైన వృత్తిలో వున్న మీరైనా ఆ గాయాన్ని మళ్లీ రేపుతూ మమ్మల్ని ఇంకా మానసిక క్షోభకి గురి చేయవద్దు." అంటూ విలపించింది ముమైత్ ఖాన్.