మరొక క్లాసిక్ అందించటానికి ఈ టీం సిద్ధమవుతోందా?

14 రీల్స్ - సూపర్ స్టార్-సుక్కు. ఈ కాంబినేషన్ తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో ఫైనెస్ట్ మూవీస్ రూపొందగలవు అని '1 నేనొక్కడినే' చిత్రంతో నిరూపించారు. ఆ చిత్రం ద్వారా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ అధినేతలు ఎంత సొమ్ము నష్టపోయారనేది పక్కనపెడితే ఆ చిత్రం మూస ధోరణి నుంచి మార్పు కోరుకునే ప్రేక్షకులకి ఎలాంటి మధుర జ్ఞాపకంగా నిలిచిపోయిందో అందరికి తెలిసిందే. ఇండస్ట్రీ వర్గాలు సైతం ఒక సినిమా బాక్స్ ఆఫీస్ ఫెయిల్యూర్ కి అమితంగా వాపోయిన సందర్భం '1 నేనొక్కడినే'. ఇంత మందిని అమితంగా ఆకట్టుకున్న ఈ టీం మరొకసారి చిత్రం చేయటానికి పూనుకోనున్నారట.
రంగస్థలం చిత్రం పూర్తి చేసే పనిలో బిజీ షెడ్యూల్స్ తో గడుపుతున్న సుకుమార్ తన తదుపరి చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేయటానికి ఇప్పటికే ఒక స్టోరీ లైన్ సిద్ధం చేసుకున్నాడట. రంగస్థలం పనులన్నీ పూర్తి కాగానే పూర్తి స్టోరీ తో మహేష్ ని కలిసి సినిమా లాక్ చేసుకునే యోచనలో సుక్కు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ చర్యలన్నిటికి సూత్రధారులు 14 రీల్స్ వారేనట. మరొకసారి మహేష్-సుక్కు ల కాంబినేషన్ లో వచ్చే వైవిధ్యమైన చిత్రం తమ ప్రొడక్షన్ హౌస్ నుంచే రావాలని సుక్కు కి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారు నిర్మాతలు అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట. కొరటాల చిత్రం తరువాత వంశి పైడిపల్లి, త్రివిక్రమ్, పూరి జగన్నాథ్ ఇలా మహేష్ రాబోయే చిత్రాలకి పెద్ద వెయిటింగ్ లిస్ట్ వుంది. మరి 14 రీల్స్ వారు ఈప్రాజెక్టు ని ఎప్పటికి మెటీరియలైజ్ చేయగలుగుతారో చూద్దాం.

