భావనకు న్యాయం జరిగినట్టేనా...!!

మలయాళ నటి భావనపై లైంగిక దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎప్పటినుండో నడుస్తున్న ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ హీరో దిలీప్ కుమార్ ని సోమవారం సాయంత్రం పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు. భావనకు డ్రైవర్ గా పనిచేసిన మార్టిన్ తోపాటు మరికొందరు ఆమె వాహనాన్ని అడ్డుకుని కిడ్నాప్ చేసి ఆమె పై లైంగిక దాడి కూడా చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో సినీపెద్దల హస్తం ఉందని మొదటినుండి అనుమానిస్తున్న పోలీస్ లు గత కొన్ని రోజులుగా దిలీప్ ని పోలీస్ స్టేషన్ కి పిలిచి విచారిస్తూనే ఉన్నారు.
కానీ దిలీప్ మాత్రం తానెటువంటి తప్పు చెయ్యలేదని వాదిస్తూనే వున్నాడు. కానీ భావన మాత్రం దీని వెనుక దిలీప్ హస్తం ఉన్నట్లు మొదటినుండి మొత్తుకుంటూనే వుంది. అయితే ఎట్టకేలకు దిలీప్ ని పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు. వారికి కొన్ని ఆధారాలు దొరకడంతో అతన్ని అరెస్ట్ చేసారు. అయితే నటి భావనపై ఉన్న వ్యక్తిగత కక్ష వలనే దిలీప్ ఈ పనిచేయించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్ లు అతడిని అదుపులోకి తీసుకోవడం కీలక పరిణామంగా మారింది.

