బుల్లితెరపై టాప్ లేపిన బాహుబలి - 2

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విజువల్ వండర్ బాహుబలి సీరిస్ సినిమాలు రెండు తెలుగు సినిమా రేంజ్‌ను ఒక్కసారిగా స్కై రేంజ్‌కు పెంచేశాయి. తెలుగు సినిమా చరిత్రను బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అన్నట్టుగా లిఖించేశాడు రాజమౌళి. ఈ ఘనత అంతా రాజమౌళిదే. బాహుబలి - ది బిగినింగ్ వరల్డ్ వైడ్‌గా రూ.600 కోట్ల కొల్లగొట్టడమే ఓ గ్రేట్ అనుకుంటే బాహుబలి - ది కంక్లూజన్ అయితే ఊహలకే అందని విధంగా రూ.1800 కోట్లకు కాస్త అటూ ఇటూగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది.
బాహుబలి 2 హిందీలో ఏకంగా రూ.400 కోట్ల షేర్ రాబట్టడంతో అక్కడి హీరోలు, ట్రేడ్ వర్గాలకు దిమ్మతిరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులు తిరగరాసిన ఈ సినిమా ఈ నెల 8వ తేదీన బుల్లితెరపై ప్రసారమైంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దేశవ్యాప్తంగా వివిధ ఛానళ్లలో ప్రసారమైంది. ప్రసారమైన అన్ని భాషల్లోనూ రికార్డు రేంజ్లో టీఆర్పీలు తీసుకువచ్చిన సినిమాగా బాహుబలి 2 నిలిచింది.
అక్టోబర్ 7-13 మధ్య ఆ వారంలో హిందీలో ప్రసారమైన అన్ని సినిమాల్లోను అత్యధిక ఇంప్రెషన్స్ సాధించిన సినిమాగా బాహుబలి 2 రికార్డులకు ఎక్కింది. బార్క్ ఇండియా ( బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా ) వెల్లడించిన వివరాల ప్రకారం సోనీ మ్యాక్స్ ఛానల్లో ప్రసారమైన 'బాహుబలి - ది కంక్లూజన్' చిత్రం 26054 ఇంప్రెషన్స్‌తో మొదటి స్థానంలో నిలిచింది.
ఇక అర్బన్ ప్రాంతాల వరకు తీసుకుంటే ఏకంగా 17671 ఇంప్రెషన్స్‌తో మిగిలిన సినిమాలకు అందని ఎత్తులో నిలిచింది. షాక్ ఏంటంటే సల్మాన్‌ఖాన్ లేటెస్ట్ మూవీ ట్యూబ్‌లైట్ అదే వారంలో బుల్లితెరలో ప్రసారమైంది. ఈ సినిమాకు ఓవరాల్‌గా 5195 ఇంప్రెషన్లు వచ్చాయి. ఈ లెక్కన చూస్తే బాలీవుడ్లో స్టార్ హీరో అయిన సల్మాన్ సినిమా మన బాహుబలి ముందు ఏ మాత్రం నిలవలేకపోయింది.

