Sat Dec 27 2025 03:56:05 GMT+0000 (Coordinated Universal Time)
బాహుబలి 2.. హిందీ శాటిలైట్ రైట్స్ 51 కోట్లు!

భారత చిత్ర పరిశ్రమ లోనే అత్యంత గొప్ప చిత్రంగా బాహుబలి ది బిగినింగ్ చిత్రాన్ని ఎందరో విశ్లేషకులు, సినీ పండితులు కొనియాడారు. అమితాబ్ బచ్చన్ సైతం బాహుబలి లో ఏ చిన్న పాత్రైనా పోషిస్తానని వెల్లడించి ఆయనకు ఆ చిత్రం పై వున్న మమకారాన్ని చాటి చెప్పారు. ఈ ప్రశంసలు పక్కన పెడితే ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని భారీ స్థాయి లోనే ఆదరించి వారి అభిమానాన్ని వసూళ్ల రూపంలో ప్రదర్శించారు. భారత దేశ చలన చిత్ర చరిత్రలోనే పీకే తరువాత స్థానంలో నిలిచి సెకండ్ హైయెస్ట్ గ్రోసర్ అయ్యింది బాహుబలి ది బిగినింగ్.
బాహుబలి 2 ఎట్టి పరిస్థితుల్లో తొలి స్థానం కైవసం చేసుకుంటుంది అని ట్రేడ్ వర్గాల అంచనా. బాహుబలి 2 కోసం ప్రపంచ వ్యాప్తంగా చిత్ర ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇటీవల బాహుబలి 2 చిత్రానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు ముగిసినట్టు సమాచారం. హిందీ శాటిలైట్ హక్కులను సోనీ టీవీ సంస్థ ఏకంగా 51 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది అని వినికిడి. ఈ సంఖ్య కనుక నిజం అయితే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సుల్తాన్ చిత్రం సాధించిన శాటిలైట్ రైట్స్ కన్నా అధిక మొత్తానికి అమ్ముడుపోయిన రికార్డు దక్కుతుంది. సుల్తాన్ చిత్రాన్ని రెండవ స్థానానికి నెత్తిన ఘనత బాహుబలికి దక్కుతుంది.
బాహుబలి 2 చిత్రీకరణ శరవేగంగా పూర్తి చేసే పనిలో రాజమౌళి తన బృందాన్ని నిమగ్నం చేసి ఉంచారు. 2017 మే నెలలో బాహుబలి 2 విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విడుదలకు ఆరు నెలల ముందే డిస్ట్రిబ్యూషన్ తో పాటు, శాటిలైట్ హక్కులు కూడా అమ్ముడైపోవడం కూడా గొప్ప పరిణామంగానే చెప్పుకోవాలి.
Next Story

