పవర్ స్టార్ సెట్స్ లో నందమూరి హీరో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ పరాజయం నుంచి బైటకి వచ్చి తదుపరి చిత్రం పట్టాలెక్కించటానికి దాదాపు ఆరు నెలలు పట్టింది. కాటమరాయుడు చిత్రం పట్టాలెక్కి ఇప్పుడు రెగ్యులర్ షెడ్యూల్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ చిత్రం మొదలుపెట్టే వరకు రకరకాల దర్శకుల పేర్లు ప్రచారం లో ఉండటం, దర్శకుల మార్పులు జరగటం, చివరికి గబ్బర్ సింగ్ ఆన్ స్క్రీన్ కాంబో తో చిత్రం తెరకెక్కనుండటంతో ఈ చిత్రం తొలి నుంచి వరుసగా వార్తల్లో ఉంటూనే వుంది. కాగా వీటన్నిటికీ మించి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఒక ఫోటో సందేహాలను రేపుతూ మరింత సంచలనం సృష్టిస్తోంది.
కాటమరాయుడు చిత్రీకరణ జరుగుతున్న సెట్స్ కు నందమూరి హీరో తారక రత్న విచ్చేసారు. సాధారణంగా ఆయన దాయాదులు ఐన ఇతర నందమూరి హీరోల చిత్రీకరణల్లోనే ఎప్పుడు కానరాని తారకరత్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్ర చిత్రీకరణలో కనిపించటంతో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తారక రత్న సెట్స్ లో శివ బాలాజీ తో పాటు భోజనం చేస్తున్న ఫోటో ఒకటి ట్విట్టర్ లో తారసపడింది. కాటమరాయుడు చిత్రంలో పవన్ కళ్యాణ్ కి ముగ్గురు తమ్ముళ్లు ఉండగా ఆ పాత్రల్లో శివ బాలాజీ, అజయ్, కమల్ కామరాజు నటిస్తున్న సంగతి విదితమే. తారక రత్న తన చిరకాల మిత్రుడు శివ బాలాజీని కలిసేందుకే కాటమరాయుడు సెట్స్ కి వెళ్ళారా? లేక మరే ఇతర కారణాన వెళ్ళారా అనే సందేహానికి ఊహాగానాలే తప్ప ఎవరి వద్దా సమాధానం లేదు. దీనికి తారక రత్న స్వయంగా వివరణ ఇస్తే తప్ప వాస్తవం వెలువడని పరిస్థితి.

