Mon Dec 22 2025 03:03:57 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ తో నటించే నాయికల జాబితా ఇదేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నట జీవితం ప్రారంభం ఐన నాటి నుంచి ఒక చిత్రం విడుదల తరువాతే మరో చిత్రం పై దృష్టి పెడుతుండేవారు. కాని రానున్న రెండున్నర సంవత్సరాలలో వీలైనన్ని ఎక్కువ చిత్రాలు చేసి తరువాత రాజకీయాలకు ఎక్కువ సమయం కేటాయించే ఉద్దేశంలో ఉన్నట్టున్నారు. రానున్న రాష్ట్ర శాసన సభ ఎన్నికలలో తానుకూడా పోటీ చేయనున్నట్టు ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన కాటమరాయుడు చిత్రీకరణ దశలో ఉండగానే త్రివిక్రమ్ మరియు నీసన్ ల దర్శకత్వంలో రెండు చిత్రాలను ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
కాటమరాయుడు చిత్రంలో శృతి హాసన్ నటిస్తుండగా, పవన్ కళ్యాణ్ తదుపరి రెండు చిత్రాలకు కథానాయికలను వెతికే పనిలో పడ్డారు ఆయా చిత్రాల నిర్మాతలు. త్రివిక్రమ్ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉండగా ఒక కథానాయికగా కీర్తి సురేష్ ని ఇప్పటికే ఖరారు చేశారు. మరో కథానాయిక పాత్ర కోసం పూజ హెగ్డే తో సంప్రదింపులు జరుపుతున్నారు. మరో పక్క తమిళ దర్శకుడు నీసన్ ఆయన చిత్రంలో కథానాయికగా తొలుత నయనతార ని అనుకున్నా ఇప్పుడు త్రిష తో ఆ పాత్ర చేయించాలని నిశ్చయించుకున్నట్టు సమాచారం. ఇప్పటికి పలుమార్లు కథానాయికల మార్పులు జరగగా ఈ కథానాయికల జాబితా ఖరారు కావటం పై కూడా కొన్ని సందేహాలు వెలువడుతున్నాయి. పూజ హెగ్డే, త్రిష ల స్థానాల్లో వేరే పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశాలు కూడా వున్నాయి. మరి పవర్ స్టార్ ఎవరికీ అవకాశం ఇస్తాడో చూడాలి.
Next Story

