న్యూ లుక్ కోసం అమెరికాకి!!

డీజే హిట్ తో అల్లు అర్జున్ కొత్త ఉత్సాహంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మొదలు పెట్టేసాడు. కొత్త డైరెక్టర్ వక్కంతం వంశీకి అవకాశం ఇస్తూ 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' అనే చిత్రాన్ని స్టార్ట్ చేసి సెట్స్ మీదకెళ్ళాడు. ఈ సినిమాపై మెగా ఫాన్స్ లోనే కాదు ప్రతి ఒక్క ప్రేక్షకుడిలో మంచి ఆసక్తి నెలకొని వుంది. రైటర్ గా మంచి ఫామ్ లో ఉన్న వక్కంతం వంశి మొదటిసారి డైరెక్షన్ చేస్తున్న సినిమా కావడం, అలాగే చిత్ర కథ మొత్తం దేశభక్తి నైపథ్యంలో ఉండడం వంటి అంశాలు, అల్లు అర్జున్ ఒక మిలటరీ ఆఫీసర్ గా కనబడే ఈ సినిమా పై అప్పుడే భారీ అంచనాలు కూడా మొదలయ్యాయి.
అయితే అల్లు అర్జున్ తన సినిమాలు సెట్స్ మీదకెళ్లేటప్పుడు సినిమా కథను బట్టి తన లుక్ ని మార్చుకుంటూ.... సరికొత్తగా ప్రేక్షకులని అలరిస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు నా పేరు సూర్య కోసం మిలటరీ ఆఫీసర్ లుక్ లోకి మారడానికి గాను అల్లు అర్జున్ ఒక నెలరోజుల పాటు అమెరికాకు వెళ్ళబోతున్నాడట. ఫిజికల్ ఫిట్నెస్, న్యూ లుక్ కోసం బన్నీ అక్కడ యుఎస్ లో కఠినమైన శిక్షణ తీసుకోబోతున్నాడట. ఇక వీటికోసమే బన్నీ ఈ వారాంతంలో అమెరికాకి బయలుదేరి వెళతాడని సమాచారం. ఇక అల్లు అర్జున్ న్యూ లుక్ చాలా కొత్తగా డిఫరెంట్ గా ఉండబోతుందని అంటున్నారు.
ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి జోడిగా అను ఇమ్మాన్యువల్ నటిస్తుండగా... విశాల్ – శేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల తేదీని ప్రకటిస్తారని కూడా సమాచారం అందుతుంది.

