నందమూరి హీరో జోరు మాములుగా లేదు

నందమూరి హీరోల్లో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో దూసుకుపోతుంటే.... కళ్యాణ్ రామ్ మాత్రం ఒకపక్క హీరోగానూ, నిర్మాతగానూ కొనసాగుతున్నాడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో బాగానే ఆకట్టుకున్న కళ్యాణ్ రామ్ ఆతర్వాత మరో పదేళ్లకు 'పటాస్' సినిమాతో హిట్ కొట్టాడు. ఆ తర్వాత కూడా నిర్మాతగా అతని తమ్ముడు ఎన్టీఆర్ సినిమాని నిర్మిస్తూనే ఒక పక్క కాజల్ అగర్వాల్ కు జోడిగా 'ఎమ్యెల్యే' సినిమాలో నటిస్తూనే మరో పక్క తమన్నా తో 'నా నువ్వే' సినిమాని పూర్తి చేసేసాడు. 'ఎమ్యెల్యే', 'నా నువ్వే' సినిమాలు రెండు షూటింగ్ ని పూర్తి చేసుకోవడానికి మరికొన్ని రోజులు మాత్రమే టైం పడుతుంది.
ఇలాంటి సమయంలోనే కళ్యాణ్ రామ్ మరో కొత్త దర్శకుడితో కొత్త సినిమా కి శ్రీకారం చుట్టాడని తెలుస్తుంది. మరి ఈ కొత్త దర్శకుడిని ఇండస్ట్రీలోని టాప్ రైటర్ కోన వెంకట్ కళ్యాణ్ రామ్ దగ్గరికి పంపినట్లుగా తెలుస్తుంది. ఇక కోన చెప్పినట్లుగా ఆ దర్శకుడు కళ్యాణ్ రామ్ ని కలిసి కథని వినిపించగా ఆ కథ కళ్యాణ్ రామ్ కి నచ్చడం.. ఓకె చెయ్యడం రెండు జరిగాయట. ఇక ఆ కొత్త దర్శకుడితో కళ్యాణ్ రామ్ చెయ్యబోయే ఆ సినిమాకి టైటిల్ కూడా పెట్టేశారని టాక్ వినబడుతుంది. 'ఎమ్యెల్యే, నా నువ్వే' అంటూ కొత్తగా ట్రై చేస్తున్న కళ్యాణ్ రామ్ తన కొత్త సినిమాకి కూడా 'మిలియనీర్' అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది.
ఇక కోన వెంకట్ ఇంతకు ముందు శివ నిర్వాణ అనే కొత్త దర్శకుడ్ని హీరో నాని వద్దకు 'నిన్నుకోరి' కథతో పంపగా దాన్ని నాని ఓకె చెయ్యడం అది కాస్త హిట్ కావడం జరిగిపోయాయి. మరి ఇప్పుడు కోన పంపిన కొత్త దర్శకుడు కూడా కళ్యాణ్ రామ్ కి నిన్నుకోరి లాంటి హిట్ ఇస్తాడేమో చూద్దాం.

