‘ధ్రువ’ అన్బేరబుల్ అని చిరు అనుకున్నారా?

కంగారేమీ అక్కర్లేదు... సినిమా బాగోలేదని చిరు భావించడం గురించిన కబురు కాదిది. కాకపోతే.. ధ్రువ సినిమా ఫైనల్ కాపీ పూర్తయిన తరువాత.. వచ్చిన నిడివి చూసి మెగాస్టార్ చిరంజీవి కంగారు పడ్డారుట. ఈ రోజుల్లో కూడా ఇంత నిడివి ఉన్న చిత్రంతో ప్రేక్షకులను మెప్పించడం కష్టం అనే అభిప్రాయానికి వచ్చారుట. అందుకే సెన్సార్ కూడా పూర్తయిన ధ్రువ చిత్రానికి మెగాస్టార్ తాను స్వయంగా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చుని.. ఓసారి కత్తెర వేయడానికి సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తున్నది.
వరుస ఫ్లాప్ లను చవిచూసిన తరువాత.. మెగాపవర్ స్టార్ గా అభిమానులు పిలుచుకునే రాంచరణ్ ఎన్నో ఆశలతో ధ్రువ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తనకు బాగా నప్పుతుందని ఆయన భావించే పోలీస్ ఆఫీసర్ పాత్రనే ఈ చిత్రంలో కూడా చేస్తున్నారు. విజయదశమికి విడుదల అవుతుందని ప్రకటించిన ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడింది. ఫైనల్ గా డిసెంబరు 2న విడుదల చేస్తున్నాం అని ప్రకటించినప్పటికీ.. మళ్లీ ఒక వారం వెనక్కు తీసుకువెళ్లారు. డిసెంబరు 9న విడుదల కాబోతోంది. అయితే ధ్రువ చిత్రం విడుదలకు 20 రోజుల ముందే సెన్సార్ ను కూడా పూర్తి చేసేసుకుంది.
సెన్సార్ పూర్తయిన కాపీ నిడివి. 2 గంటల 43 నిమిషాలు వచ్చిందిట. ఈ రోజుల్లో ఇది చాలా పెద్ద చిత్రం అవుతుందని ప్రధానంగా మెగాస్టార్ భావించారుట. ఈ మద్య కాలంలో 95 నిమిషాల నిడివితోనూ సినిమాలు వచ్చేస్తున్నాయి. 1 గంటా 40 నిమిషాల నిడివితో బోలెడు చిత్రాలు వచ్చేస్తున్నాయి. వాటిని ప్రేక్షకులు చక్కగానే ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఇలాంటి రోజుల్లో ఏకంగా పూర్వకాలపు పౌరాణిక చిత్రాలు చూసిన రేంజిలో 2.43 గంటల నిడివి ఉన్న చిత్రం అంటే.. ప్రేక్షకులకు బోరు కొట్టేయవచ్చునని మెగాస్టార్ భయపడ్డారుట. అందుకే ఆయన స్వయంగా మళ్లీ సినిమా నిడివి తగ్గించడానికి పూనుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
అయినా.. 2.43 గంటల సినిమా అంటే ఈ రోజుల్లో అనూహ్యమైనదే. అల్లు అరవింద్ లాంటి అనుభవజ్ఞుడైన నిర్మాత దగ్గరుండి కూడా.. ఇలా సినిమా అదుపు తప్పి అంత నిడివి ఎలా తయారైంది చెప్మా?

