దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకుంటున్న అందాల భామ

చలన చిత్ర పరిశ్రమ నిర్మాతల ఆధిపత్యం నుంచి కథానాయకులు, దర్శకుల చేతిలోకి వెళ్లిపోయింది. అందుకే దర్శకుడు, కథానాయకుడు తీసుకునే పారితోషికాలు అసలు చిత్ర చిత్రీకరణ వ్యయం కన్నా అదనం అవుతున్నాయి. మరీ దర్శకుల స్థాయి కాకపోయినా పారితోషికాల విషయంలో అందాలు ఆరబోసే కథానాయికలకు నిర్మాతల దగ్గర షరతులు విధించే హోదా ఉంటుంది. కానీ ఈ అవకాశం సక్సెస్ రేట్ ఉన్న భామలకు మాత్రమే ఉంటుంది. అయితే ఎప్పుడో కెరీర్ మొదలు పెట్టినప్పటి రోజులలో రకుల్ ప్రీత్ సింగ్ కి గోల్డెన్ లెగ్ ముద్ర పడింది. కిక్ 2, బ్రూస్ లీ వంటి పరాజయాలు ఎదురైనా స్టార్స్ పక్కన నటించే అవకాశాలు అమ్మడి తలుపు తడుతూనే ఉన్నాయి.
నాన్నకు ప్రేమతో విడుదల తర్వాత సుకుమార్ చెప్పినట్టు రకుల్ నిజంగానే చాలా తెలివైనదే. ఇప్పుడు అవకాశాలు తలుపు తడుతుండటంతో పారితోషికం విషయంలో బెట్టు చేసే వీలు ఉంది, కానీ హీరోల లా తనది దీర్ఘ కాలం కొనసాగే నట జీవితం కాదు అని గ్రహించేసింది. సినిమాల్లో సంపాదిస్తున్న అధిక మొత్తాన్ని కొంత భూమిపై పెడుతూ, మిగతా మొత్తాన్ని తన సోదరుడితో కలిసి ఎఫ్-45 అనే జిమ్ ప్రారంభించింది. నగరాల్లో ఉండే యువత బాడీ ఫిట్నెస్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటంతో తన వ్యాపారాన్ని ఇతర నగరాలకు విస్తరించే యోచనలో ఉందంట రకుల్. ఇప్పటికే పూణే, బెంగుళూరు వంటి నగరాలలో తనకు సహకరించే వ్యాపార భాగస్వాములను సిద్ధం చేసుకుంది అంట ఈ భామ. సంపాదన జాగ్రత్త చేసుకునే విషయంలో వయసుకి మించిన చొరవ తో మిగిలిన తారలకంటే ముందే ఉంది రకుల్ ప్రీత్.
ఈ ఏడాది సరైనోడు తో ఆకట్టుకున్న రకుల్ ప్రీత్ సింగ్, ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ ధ్రువ, సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన మరో చిత్రం లో నటిస్తూ బిజీగా ఉంది.

