తొలి నిర్మాత చిత్ర పోస్టర్ లాంచ్ చేయనున్న యువ హీరో

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారి దగ్గర దర్శక బృందంలో పని చేస్తుండే సమయంలో నాచురల్ స్టార్ నట జీవితానికి నాంది పలికిన చిత్రం అష్ట చమ్మా. ఆ చిత్ర నిర్మాత రామ్ మోహన్ తన తదుపరి చిత్రాలు ఐన గోల్కొండ హై స్కూల్, ఉయ్యాలా జంపాల లతో కూడా అభిరుచి వున్న నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. గత ఏడాది ఆయనే దర్శకుడిగా మారి తాను నేను అనే చిత్రాన్ని తెరకెక్కించి పరాజయం చెందటంతో ఈ సారి మళ్లీ కొత్త దర్శకుడికి, నూతన నటీనటులకు అవకాశం కల్పించి ఆయన పిట్ట గోడ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
విశ్వదేవ్ రాచకొండ అనే కొత్త కుర్రాడు ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అవుతుండగా, కే.వి.అనుదీప్ అనే దర్శకుడికి కూడా ఇది పరిచయ చిత్రం. ప్రాణం, వాన వంటి అద్భుతమైన హిట్స్ అందించి తరువాతి కాలంలో కనుమరుగైన సంగీత దర్శకుడు కమలాకర్ పిట్టగోడ చిత్రంతో మళ్లీ వెలుగులోకి రానున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని నాచురల్ స్టార్ నాని చేత విడుదల చేపించనున్నారు నిర్మాత రామ్ మోహన్. అభిరుచి గల నిర్మాతగా పేరు పొందిన రామ్ మోహన్ చిత్రం కావటంతో, పైగా కొత్త దర్శకుడి ఆలోచనతో సినిమా రూపొందుతుండటంతో ఎ సెంటర్ ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఆతృతతో ఎదురు చూస్తున్నారు.

