తేజ తన కథతో అంత ఇప్రెస్ చేశాడా?

ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ రామా నాయుడు మరణం తరువాత స్ట్రెయిట్ తెలుగు చిత్రాలు ఏమి నిర్మించలేదు. రీమేక్ చిత్రాలు, లేదా వైవిధ్య కథలతో తెరకెక్కే చిన్న చిత్రాల సమర్పణకు పరిమితం ఐయ్యింది. దగ్గుబాటి వెంకటేష్ నట జీవితం ప్రారంభ దశలో ప్రతి అడుగున వెంట ఉండి కథల ఎంపిక నుంచి అన్ని విభాగాలను స్వయంగా పర్యవేక్షిస్తూ చిత్ర నిర్మాణంలో తన తండ్రితో పాటు ముఖ్య పాత్ర పోషిస్తుండే వారు నిర్మాత సురేష్ బాబు. ఆ ప్రభావంతోనే అనతి కాలంలోనే అరుదైన చిత్రాలలో నటించే సదావకాశం వెంకటేష్ కు దక్కింది.
దగ్గుబాటి వంశం నుంచి తరువాతి తరం వచ్చే సరికి సురేష్ బాబు చిత్రాల ఎంపికలో అంతా క్రియాశీలక పాత్ర పోషించలేకపోయారు. రానా దగ్గుబాటి ఏ.వి.ఎం సంస్థ వారి నిర్మాణంలో లీడర్ చిత్రంతో తెరకు పరిచయం ఐన నాటి నుంచి నేటి వరకు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అనేక చిత్రాలలో నటించినా సొంత నిర్మాణ సంస్థలో చిత్రం చెయ్యలేదు. ఇంత కాలానికి రానా కు ఆ అవకాశం వచ్చింది. సురేష్ బాబు నేరుగా ఒక తెలుగు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు తేజ చెప్పిన కథను చాలా కాలం క్రితమే అంగీకరించారు. ఇప్పుడు ఆ చిత్ర మొదటి షెడ్యూల్ చిత్రీకరణ తమిళనాడు లో జరుపుకుంటుంది.
తేజ పరిచయం చేసిన కథానాయిక కాజల్ అగర్వాల్ లక్ష్మి కళ్యాణం తరువాత మళ్లీ ఆయన దర్శకత్వంలో పనిచేస్తున్న చిత్రం ఇది. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థకే చెందిన యువ హీరో రానా తో.. దేశంలోనే అతిపెద్ద నిర్మాణ సంస్థ అయిన వారి సొంత బ్యానర్ ఇప్పుడే మొదటిసారిగా సినిమాను నిర్మిస్తోంది ... అంటే అది ఎంత ప్రతిష్ఠాత్మక చిత్రం అయి ఉంటుందో కదా? అని ఎవరికైనా సందేహం కలుగుతుంది. అలాగే కథ మీద ఎంత నమ్మకం లేకపోతే.. ఇంత కాలం గ్యాప్ తర్వాత.. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద సంస్థ స్ట్రెయిట్ చిత్రం నిర్మిస్తూ.. తమ హీరోతో చేస్తుంది? అనే నమ్మకం చూసేవారికి కూడా కలిగేలా ఉంది. నిర్మాత సురేష్ బాబును , దర్శకుడు తేజ ఆ రేంజి కథతో ఇంప్రెస్ చేశాడని అంతా అనుకుంటున్నారు.
మేకింగ్ పరంగా ఇటీవలి కాలంలో తేజ దర్శకత్వం వహించిన చిన్న చిత్రాలు ఢమాల్ అన్నప్పటికీ.. ఆయన తన కథతో మెప్పించారంటే అందులో ఏదో ఉంటుందని అంతా అనుకుంటున్నారు.

