తెలుగు సినిమా స్థాయిని పెంచే చిత్రమిది

స్వతహాగా రచయిత ఐన కొరటాల శివ దర్శకుడిగా మారి మూడు కథలను తెరకెక్కించి సంచలన విజయాలను అందుకున్నాడు. తన నాలుగవ చిత్రంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో రెండో సారి పని చేస్తున్నాడు. ఆ చిత్ర ప్రారంభోత్సవంలో కొరటాల శివ ఈ చిత్రం పై బలమైన నమ్మకంతో ఉన్నట్లు కనిపించాడు. ఆడియో వేడుకలలో, చిత్రీకరణ ప్రారంభోత్సవ వేడుకలలో ఎక్కువగా మాట్లాడని కొరటాల శివ తన నాలుగవ చిత్ర ప్రారంభోత్సవంలో మాత్రం తన కథ పై తనకు వున్నా విశ్వాసాన్ని వ్యక్త పరిచి అంచనాలను మరింత పెంచాడు.
"శ్రీమంతుడు వంటి భారీ విజయం తరువాత నేను మళ్లీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని దర్శకత్వం వహిస్తుండటంతో ఈ చిత్రం పై అంచనాలు చిత్ర ప్రకటన జరిగిన నాటినుంచి తారా స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు చేస్తున్న చిత్ర కథ శ్రీమంతుడు చిత్ర కథ కన్నా బలమైనది. కచ్చితంగా ఈ చిత్రం తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రమే అవుతుంది. మహేష్ బాబు గారు కూడా ఈ కథ పై చాలా నమ్మకంగా వున్నారు. అభిమానులు ఎన్ని అంచనాలు పెట్టుకున్నా ఆ అంచనాలను తలతన్నే స్థాయిలోనే ఉంటుంది." అని కొరటాల శివ అతి విశ్వాసంతో చెప్పి అంచనాలను భారీగా పెంచేశారు.
జనవరి నెలలో రెగ్యులర్ షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. 2017 విజయ దశమి నాటికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

