తన లోపాన్ని కూడా సగర్వంగా చెప్పుకునే నటుడు

దక్షణ భారతీయ చిత్రాలలో అగ్ర శ్రేణి నటుడిగా కీర్తి పొందిన ప్రకాష్ రాజ్ ఇప్పుడు దర్శకత్వ బాధ్యతలతో తీరిక లేకుండా ఉన్నారు. మన ఊరి రామాయణం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ప్రకాష్ రాజ్. నటుడిగా అనేక విజయాలు నమోదు చేసి, ఎన్నో పురస్కారాలు సొంతం చేసుకున్న ప్రకాష్ రాజ్ దర్శకుడిగా మాత్రం ఇంకా వెనుకంజలోనే ఉన్నారు. ఆయన దర్శకత్వం వహించిన గత రెండు చిత్రాలు ధోని, ఉలవచారు బిర్యానీ ఘోర పరాజయాన్ని చెవి చూశాయి. విజయాపజయాలతో సంబంధం లేకుండా దర్శకత్వం చూస్తుంటానని, నటుడిగా సంతృప్తి చెందానని అందుకే దర్శకత్వ బాట పట్టానని చెప్తూ తనపై వచ్చిన వివాదాలపై కూడా పెదవి విప్పారు.
"నేను ఎన్నో చిత్రాలకి చిత్రీకరణ సమయంలో ఆలస్యంగా వస్తూ ఇబ్బంది పెట్టాను అని నా మీద అనేకానేక ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు కేవలం అపోహలు మాత్రమే అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం నేను చెయ్యను. నేను ఆలస్యం గా వెళ్ళటం వాస్తవం. అది నా అలవాటు. తెల్లవారుజామున 03:30 కి నిద్రపోయి ఉదయం 09:00 కి నిద్ర లెగవటం నా అలవాటు. ఒక వ్యక్తి కోసమో, లేక ఒక సినిమా కోసమో నా అలవాట్లు నేను మార్చుకోను. నేను ఆలస్యంగా వస్తాను అని అందుకు ఇష్టం అయితేనే మీ చిత్రానికి పనిచేస్తానని ముందుగానే నిర్మాతలకి చెప్పి నేను చిత్ర ఒప్పందాలపై సంతకం చేస్తుంటాను" అని ప్రకాష్ రాజ్ తెలిపారు.
ఈ వివాదమే కాక గతంలో ఆయనకీ ప్రముఖ నటులు కోట శ్రీనివాస రావు, దర్శకులు కృష్ణ వంశి, శ్రీను వైట్ల వంటి ప్రముఖులతో వివాదాలు ఉండటం తెలిసిందే.

