తనతోపాటు అందరి కళ్ళల్లో నీళ్లు

నాగార్జున ఎప్పుడు ప్రశాంతంగానే కనబడతాడు. అందులోను మీడియా ముందు చాలా హుందాగా వ్యవహరిస్తాడు కూడా. టాలీవుడ్ లో మన్మథుడిగా పేరున్న నాగార్జున తన తండ్రి అక్కినేని చనిపోయినప్పుడు మాత్రమే బాగా ఎమోషనల్ గా కనబడ్డాడు. ఇప్పటికి అక్కినేని నాగేశ్వర రావు పేరు ఎత్తగానే తెలియకుండానే కళ్ళలో నీళ్లు వచ్చేస్తాయి నాగ్ కి. అయితే ఇప్పుడు తానూ చైతు పెళ్లి సందర్భంగా కొంత ఎమోషన్ అయ్యానని నాగ్ స్వయంగా చెబుతున్నాడు. నాగ చైతన్య - సమంతల పెళ్లి లో తనకు కళ్ళవెంట నీళ్లు వచ్చేశాయని చెబుతున్నాడు.
నాగ చైతన్య - సమంత ల పెళ్లి గోవాలో హిందూ, క్రిష్టియన్ సాంప్రదాయంలో అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన సంగతి తెలిసిందే. అయితే చైతు పెళ్లి జరుగుతున్నప్పుడు తనలో రకరకాల భావోద్వేగాలు కలిగాయని చెబుతున్నాడు నాగ్. హిందూ సంప్రదాయంలో నాగ చైతన్య... సమంత మేడలో తాళి కడుతున్నప్పుడు తన మైండ్ అంతా బ్లాంక్ అయ్యిందని... దాని తర్వాత మరుసటి రోజు క్రిష్టియన్ పెళ్లి జరుగుతున్నప్పుడు మాత్రం తనకెంతో ముచ్చటగా అనిపించడమే కాక... మైండ్ ప్లెసెంట్ గా అయ్యిందని కూడా చెబుతున్నాడు. ఇక క్రిష్టియన్ వివాహ వేడుకలో వధూవరులు ఇద్దరూ ఒకరి గురించి మరొకరు ఈ పెళ్లిని ఎందుకు చేసుకుంటున్నారో మాట్లాడాల్సి ఉంటుందని.. అందులో భాగంగా చైతు ...సమంత వేలుకి ఉంగరం తొడిగే ముందు తన జీవితంలో అన్నీ రకాలుగా సంతోషంగా ఉన్న కూడా.... ఏదో తెలియని చిన్న వెలితి ఉందని.. దాన్ని ఒక్క సమంత తీర్చిందని చెప్పాడట.
ఇక సమంత అయితే చైతు గురించిన చెప్పిన మాటలకు నాగ్ కళ్ళలో నీళ్లు తిరిగాయట. నాలుగైదు నిమిషాల పాటు చైతు గురించిన మాటలు సమంత అనర్గళంగా మట్లాడేసిందట. సమంత.. చైతు గురించి.... చైతూ నిద్ర లేవగానే చెదరకుండా ఉండే జుట్టు తనకి ఎంతో ఇష్టమని... చైతు ఎన్ని సమస్యలున్నా నవ్వుతూ ఉంటాడని.. ఆ నవ్వుతోనే సమస్యలు వాటంతటవే పరిష్కారం అయిపోతాయని సమంతచెప్పిందట. సమంత చెప్పినవి చిన్న చిన్న విషయాలే అయినా చాలా అందంగా.. మనసుకు తాకేలా చెప్పిందని.. ఇదంతా విన్న తనకి కన్నీళ్లు వచ్చేశాయని.. కళ్లు తుడుచుకుని వెనక్కి తిరిగితే అందరూ కన్నీళ్లతో కనిపించారని నాగార్జున చెప్పాడు. అందుకేనేమో నాగ్ కి తన కోడలు సమంత అంటే ఎక్కడలేని అభిమానం.

