టాలీవుడ్ రివైండ్ 2017 - 2: నందమూరి హీరోల జోష్

టాలీవుడ్లో 2017 సంవత్సరం నందమూరి హీరోలకు బాగానే కలిసొచ్చింది. అయితే ఈ యేడాది నందమూరి హీరోలు నటించిన సినిమాలు మూడు మాత్రమే రిలీజ్ అయ్యాయి. వీటిల్లో బాలయ్య సంక్రాంతికి శాతకర్ణితో పాటు సెప్టెంబర్‌లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పైసా వసూల్ సినిమాలో నటించాడు. ఎన్టీఆర్ దసరాకు జై లవకుశగా వచ్చాడు. ఈ మూడు సినిమాల్లో హిస్టారికల్ నేపథ్యంలో తెరకెక్కిన శాతకర్ణి సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దసరాకు వచ్చిన జై లవకుశ యావరేజ్ టాక్‌తోనూ బాక్సాఫీస్ వద్ద కుమ్మేసింది. పైసా వసూల్ మాత్రం డిజాస్టర్ అయ్యింది.
సంక్రాంతికి చిరు ఖైదీ నెంబర్ 150 సినిమాకు పోటీగా విడుదలైన బాలయ్య సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి కూడా సూపర్ హిట్ ఖాతాలో వేసుకోవాల్సిందే. చారిత్రక నేపథ్యం ఉన్న కథ ఇది. దాన్ని క్రిష్ తెరపైకి తీసుకొచ్చిన విధానం, అందులోని బాలయ్య సంభాషణలు సాహోరే… అనిపించాయి. దాదాపు రూ.60 కోట్ల వసూళ్లు సాధించిందీ చిత్రం. బాలయ్య కెరీర్లోనే శాతకర్ణి ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ఇక సెప్టెంబర్‌లో బాలయ్య - పూరి జగన్నాథ్ కాంబినేషన్లో పైసా వసూల్ సినిమా వచ్చింది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. రూ.15 కోట్ల షేర్ కూడా రాబట్టలేదు ఈ సినిమా. ఇక దసరా కానుకగా సెప్టెంబర్ 21న ఎన్టీఆర్ జై లవకుశ వచ్చింది. యావరేజ్ టాక్ వచ్చినా కూడా ఎన్టీఆర్ క్రేజ్‌తో ఈ సినిమా రూ.75 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. రూ.130 కోట్ల గ్రాస్ వసూళ్లు ఈ సినిమాకు వచ్చాయి. ఎన్టీఆర్ జై, లవ, కుశ మూడు పాత్రల్లో జై గా నట విశ్వరూపం చూపించాడు.
ఇక నందమూరి కళ్యాణ్‌రామ్ ఈ యేడాది ఒక్క సినిమాలోనూ నటించలేదు. అయితే జై లవకుశ సినిమాకు నిర్మాతగా మాత్రం భారీ లాభాలు వేనకేసుకున్నాడు. ఇక నందమూరి ఫ్యామిలీకి బంధువైన నారా రోహిత్ ఈ యేడాది కూడా నాలుగైదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. కథలో రాజకుమారి, బాలకృష్ణుడు అయితే ఘోరంగా విఫలమయ్యాయి. ఓవరాల్‌గా నందమూరి హీరోలకు ఏదో రూపంలో ఈ యేడాది సక్సెస్ అయితే వచ్చింది.

