గీతా క్యాంపులోకి దిల్ రాజు దర్శకుడు

2006 లో విడుదల ఐన బొమ్మరిల్లు చిత్రం సృష్టించిన ప్రకంపనలు సామాన్యమైనవి కావు. ప్రేమ కథలో కుటుంబ అనుబంధాలతో నలిగిపోయే యువకుడి జీవితాన్ని తెర పై ఆవిష్కరించి తొలి ప్రయత్నంలోనే విజయవంతం అయ్యారు దర్శకుడు భాస్కర్. ఆ చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజే భాస్కర్ కు తదుపరి అవకాశం పరుగు చిత్రంతో ఇవ్వగా సద్వినియోగ పరచుకున్నాడు. తన మొదటి చిత్రం బొమ్మరిల్లు ని తన పేరుకు ముందు తగిలించుకునే స్థాయి గుర్తింపు తెచ్చింది ఆ చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ కి. అల్లు అర్జున్ నటించిన పరుగు చిత్రం విజయం పొందటంతో మెగా క్యాంపు లో అవకాశం వచ్చింది భాస్కర్ కి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మగధీర భారీ విజయం తరువాత అంజనా ప్రొడక్షన్స్ సంస్థలో మెగా బ్రదర్ నాగ బాబు నిర్మించిన ఆరెంజ్ చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ ని పఠనం వైపు నడిపింది. మగధీర స్థాయి విజయం తరువాత ప్రేమ కథ లో రామ్ చరణ్ ని అభిమానులు జీర్ణించుకోలేని కారణం గా కానీ, అన్ని ప్రేమ కథల్లా కాక ఒక సంక్లిష్టత వుండే కథతో తెరకెక్కటం వలన కానీ చిత్రం ఘోర పరాజయం చెందింది. నాగ బాబు ఆ చిత్రానికి భారీ మొత్తంలోనే నష్టపోయారు. చిత్ర విడుదల తర్వాత మెగా క్యాంపు నుంచి పరాజయానికి దర్శకుడి వ్యూహం లోపించటమే కారణం అనే ఆరోపణలు బహిరంగంగానే వినిపించాయి.
ఆ చిత్ర పరాజయం తరువాత ఒంగోలు గిత్త, తమిళంలో బెంగుళూరు డేస్ రీమేక్ చిత్రాలు కూడా నిరాశ పరిచాయి బొమ్మరిల్లు భాస్కర్ ని. కానీ అనూహ్యంగా తాను మళ్లీ మెగా క్యాంపు లో పడ్డాడు. అయితే ఈసారి మెగా బ్రదర్ నిర్మాణంలో కాదు. గీత ఆర్ట్స్ సంస్థలో అల్లు అరవింద్ నిర్మిస్తారు. భాస్కర్ చెప్పిన కథ అల్లు అరవింద్‌కు బాగా నచ్చటంతో ముందుగా అల్లు అర్జున్ అనుకున్నా, ఇప్పుడు వేరే కథానాయకుడి తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ చిత్ర విషయాలు అధికారికంగా త్వరలో వెలువడనున్నాయి.

