ఖాళీ అయ్యేసరికి నాగ్ కథను బయటకు తీశాడు

కొత్త నీరు వచ్చి పాత నీరుని సాగనంపిన చందాన ప్రస్తుత తరం దర్శకులు ఐన జాగర్లమూడి రాధ క్రిష్ణ, హను రాఘవపూడి, నాగ్ అశ్విన్ లాంటి దర్శకుల చిత్రాలు మూస పద్దతిలో నడిచే మాస్ మసాలా చిత్రాల నుంచి ప్రేక్షకులకు విముక్తి కలిగిస్తున్నాయి. ఇటువంటి కళాత్మకమైన ఆలోచనలతోనే దర్శకుడిగా మారిన మరో యువ దర్శకుడు చందూ మొండేటి. నిఖిల్ తో కార్తికేయ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతూనే సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో కొత్త తరహా కథ చెప్పి సూపర్ సక్సెస్ అందుకున్నాడు చందూ మొండేటి.
తన రెండవ చిత్రంగా మళయాళ ఇండస్ట్రీ హిట్ ఐన ప్రేమమ్ చిత్రాన్ని రీమేక్ చేసి అదే పేరు తో విడుదల చేసాడు చందూ. విజయ దశమి పండుగ పోటీలో రావటం, నాగ చైతన్య మార్కెట్ స్థాయి కొంత మేర ఇబ్బంది పెట్టటంతో పంపిణీదారులు నష్టాలు లేకుండా బైట పడగలిగారు కానీ వసూళ్ల పరంగా ఆశించిన స్థాయి ఫలితాలు రాలేదు. కాకపోతే చిత్ర బృందం లోని ప్రతి ఒక్కరికి గొప్ప గౌరవం తెచ్చిపెట్టింది ఈ తెలుగు ప్రేమమ్. దానితో చందూ మూడవ చిత్రానికి నాగార్జున, వెంకటేష్, రవితేజ వంటి వారంతా అవకాశాలు ఇవ్వగా ఆయన మాత్రం వరుణ్ తేజ్ కోసం ఒక కథ సిద్ధం చేసుకుని ఐ డ్రీమ్స్ వాసుదేవ రెడ్డికి ఆ చిత్రం చేస్తానని మాట ఇచ్చాడు.
దురదృష్టవ శాత్తు వరుణ్ తేజ్ కాలికి గాయం కావటంతో ఆయన రెండు నెలలు చిత్రీకరణల నుంచి విరామం పొందుతున్నారు. దానితో వరుణ్ తేజ్ ఇప్పటికే ఓప్పందం కుదుర్చుకున్న మిస్టర్, ఫిదా చిత్రాలే ఆలస్యం కానున్నాయి. దానితో చందూ తాను ఎప్పుడో నాగార్జున కోసం రాసుకున్న ఒక పోలీస్ స్టోరీ ని ఇప్పుడు తెరకెక్కించే పనిలో పడాడ్డు అని సమాచారం. ఈ కథపై నాగార్జున కూడా ఆసక్తి కనబరుస్తునట్టు తెలుస్తుంది. మరి ఈ చిత్రం ఎప్పటికి పట్టాలెక్కుతుందో చూడాలి.

