కొరటాల శివ కూడా కథ కొన్నాడా?

దర్శకుడిగా మారి వరుస విజయాలతో దూసుకుపోతున్న రచయిత కొరటాల శివ తన తదుపరి చిత్రం మహేష్ బాబు తో చేయనున్న సంగతి విదితమే. శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత వీరిద్దరి కలయిక చిత్రం రానుండటంతో చిత్రం చర్చల దశలో ఉండగానే అంచనాలు తారా స్థాయికి చేరాయి. స్వతహాగా రచయిత అయిన కొరటాల శివ తాను దర్శకత్వం వహించిన మూడు చిత్రాలు మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ చిత్రాలకు కూడా స్క్రిప్ట్ కే ప్రధాన పాత్ర ఇచ్చి కథలోని బలమైన పాయింట్ ను అంతే బలంగా స్క్రీన్ పై ప్రాజెక్ట్ చేసి స్టార్ హీరో ల అభిమానులను కూడా హీరో సెంట్రిక్ గా సినిమా చూడకుండా కథ పరంగా సినిమా చూసేలా చేసి సక్సెస్ అయ్యాడు.
కథ, కథనాలకు అంతటి ప్రాధాన్యం ఇచ్చే దర్శకుడు కావటం వలన ఈ సారి మహేష్ బాబు తో ఎటువంటి కథ తెరపై చెప్తాడో అనే ఆసక్తి ప్రేక్షకులతో పాటు పరిశ్రమ వర్గాలలోనూ నెలకొంది. అయితే ఈ సారి కొరటాల శివ తాను రచించిన కథ కాకుండా శ్రీహరి నాను అనే రచయిత రాసిన కథను కోటి రూపాయల పారితోషికం చెల్లించి సొంతం చేసుకున్నట్టు గుసగుసలు వినపడుతున్నాయి. హర్షవర్ధన్ రానే, హరిప్రియ జంటగా నటించిన యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ తకిట తకిట చిత్రాన్ని రచించి తెరకెక్కించిన అనుభవం వుంది శ్రీహరి నాను కి. ప్రముఖ కథానాయిక భూమిక నిర్మించిన తకిట తకిట చిత్రంలో కింగ్ నాగార్జున, అనుష్క శెట్టి అతిధి పాత్రలలో మెరిసినప్పటికీ ఈ చిత్రం ప్రజల్లోకి వెళ్లలేకపోయింది.
శ్రీహరి నాను సిద్ధం చేసుకున్న కథ కొరటాల శివకు బాగా నచ్చటంతో కోటి రూపాయల పారితోషికంతో పాటు టైటిల్ కార్డు లో స్టోరీ క్రెడిట్ కి మాట ఇచ్చి కథ తీసుకున్నట్టు అనేక కథనాలు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. మరి కొరటాల శివ ఈ కథ వెనుక దాగివున్న రహస్యాల గురించి స్పందిస్తే తప్ప చిత్రం విడుదల అయ్యేవరకు సత్యం ఏమిటో ప్రపంచానికి తెలిసే అవకాశం లేదు.

