కామెడీ షోలకి ఇప్పటికైనా బ్రేక్ పడుతుందా?

బాలీవుడ్ లో పాపులరైన కామెడీ షోలను ఇప్పుడు తెలుగులోకి కూడా దించారు. గత నాలుగేళ్లుగా ప్రముఖ ఛానల్స్ లో ఈ కామెడీ షోలకి పెద్ద పీట వేస్తున్నారు. అయితే ఈ టీవీ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో క్లిక్ అయినట్లుగా మరే ఛానల్ లో చేసిన కామెడీ షో క్లిక్ అవలేదు. జబర్దస్త్ పేరుతొ ఈ టీవీలో గురు శుక్రవారాల్లో ఈ కామెడీ షో ప్రసారమవుతుంది. ఈ షోలో కమెడియన్స్ వేసే పంచ్ లకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యి ఆ షోని సక్సెస్ చేశారు. కడుపుబ్బా నవ్వించే కామెడీతో జబర్దస్త్ పాపులారిటీ విపరీతముగా పెరిగిపోయింది.
అయితే గత కొంతకాలంగా ఈ కామెడీ షో పై విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. బయట కొంతమందిని కించపరిచే విధంగా ఈ షోలో కామెడీ డైలాగ్స్ ఉంటున్నాయని... ఈ షో వలన కొందరి మనోభావాలు దెబ్బతింటున్నాయని బయట చాలామంది చాలా రకాలుగా కామెంట్ చెయ్యడమే కాదు.. గతంలో జబర్దస్త్ షో నిర్వాహకుల దగ్గరనుండి... జడ్జ్ ల వరకు వారిమీద పలువురు కేసులు పెట్టిన సందర్భాలు లేకపోలేదు. కానీ ఇప్పుడు మాత్రం కొద్ది కాలంగా కొంతమందిని టార్గెట్ చేసుకుని కామెడీ పంచ్ డైలాగ్స్ ని రైటర్స్ రాస్తున్నారని.... ఆ డైలాగ్స్ ని ఏ మాత్రం ఆలోచించకుండా జబర్దస్త్ స్టేజ్ మీద కమెడియన్స్ వాడుతున్నారని.. ఆ వెకిలి కామెడీకి జడ్జ్ లు గా వస్తున్న నాగబాబు, రోజాలు పడి పడి నవ్వుతున్నారని కామెంట్ చెయ్యడమే కాదు ఈ షో ని బ్యాన్ చెయ్యాలంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
అలాగే ఈ టీవీ ప్లస్ లో వస్తున్న పటాస్ ని కూడా నిషేధించాలంటూ మహిళా సంఘాలు విజయవాడ వేదికగా డిమాండ్ చెయ్యడమే కాదు... ఆ షోస్ ని నిలిపివేయాలని సంతకాల సేకరణ కూడా మొదలెట్టారు. ఆ షోస్ లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువగా ఉంటున్నాయని... అలాంటి షోస్ ని నిషేధించాలంటూ ఏపీ మహిళా సమాఖ్య, ఐద్వా తదితర సంఘాల ఆధ్వర్యంలో ఈ సంతకాల సేకరణ మొదలెట్టారు.ఇలాంటి అసభ్యకర షోస్ ని నిషేదించాలని.... అందుకోసం ప్రభుత్వం నడుం బిగించాలని కూడా వారు కోరుతున్నారు.

