ఎంత క్రేజ్ బాబు

అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ క్రేజ్ ఆకాశాన్ని తాకింది. ఆ సినిమా హిట్ తో ఎక్కడ చూసిన మనోడే కనబడుతున్నాడు. బట్టల షాప్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా.. అలాగే షాప్ లకు రిబ్బన్ కటింగ్స్ వంటి వాటితో నిత్యం హడావిడి చెయ్యడమే కాదు... అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ బయటకెక్కడికి వచ్చినా ట్రెడిషనల్ గా పంచె కట్టుకుని... చాలా పద్దతిగా... స్టైలిష్ గా దర్శనమిస్తున్నాడు. మంచి డిజైనర్ డ్రెస్సులతో ఫోటో షూట్స్ అంటూ హడావిడి చేస్తూ బాగా బిజీగా వున్నాడు. ఇక అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ నటించబోయే చిత్రంపై భారీ అంచనాలే కాదు.. ఎటువంటి చిత్రంతో ప్రేక్షకులముందుకు రానున్నాడో అని యువత తెగ ఎదురుచూస్తుంది.
అయితే విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా సంగతి ఏమోగానీ ప్రస్తుతం విజయ్ నిన్న శనివారం రాత్రి జరిగిన నెక్స్ట్ నువ్వే సినిమా ఆడియో వేడుకకి విచ్చేశాడు. ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ఈ నెక్స్ట్ నువ్వే ఆడియో వేడుకకి విజయ్ దేవరకొండ అతిధిగా హాజరయ్యాడు. స్పెషల్ గెస్ట్ గా వచ్చిన విజయ్ దేవరకొండ నిజంగానే అక్కడున్న అందరిలో స్పెషల్ గా కనిపించి అందరి మనసులు దోచేశాడు. పంచెకట్టుతో అదిరిపోయే యాటిట్యూడ్ తో విజయ్ అందరిని ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా విజయవంతమవాలని చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పాడు విజయ్. ఇక ఆ ఆడియో వేడుకలో విజయ్ కి అందరూ హగ్ లు ఇవ్వడం దగ్గర నుండి షేక్ హాండ్స్ ఇచ్చేవరకు పోటీపడ్డారు అంటే మనోడి క్రేజ్ ఏ లెవల్లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు అంటున్నారు.

