ఉయ్యాలవాడ కోసం మరో హీరో దిగుతున్నాడు!!

చిరంజీవి 151 వ చిత్రాన్ని అతి త్వరలోనే మొదలుపెట్టబోతున్నాడు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రామ్ చరణ్ నిర్మాతగా ఈ ఉయ్యాలవాడని మూడు భాషల్లో విడుదల చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నారు. అయితే ఉయ్యాలవాడ చిత్రం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని మెగా ఫాన్స్ పిచ్చిగా ఎదురు చూస్తున్నారు. మొన్నీమధ్యనే ఆగష్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మొదలెడతారని చెప్పినప్పటికీ ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదుగాని చిరంజీవి పుట్టున రోజు సందర్భంగా ఉయ్యాలవాడ మొదలవ్వొచ్చనే ఊహాగానాలు మాత్రం బాగా ఉన్నాయి.
అయితే ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో క్రేజ్ తీసుకురావాలంటే బాలీవుడ్ నటులతో పాటే ఇతర భాష నటులకు ఈ ఉయ్యాలవాడ చిత్రంలో చోటివ్వాలని ప్లాన్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఉయ్యాలవాడ చిత్రంలో బాలీవుడ్ మెగా స్టార్ అమితాబచ్చన్ నటిస్తున్నాడంటూ ప్రచారం జరిగింది. అమితాబ్ కూడా ఉయ్యాలవాడలో నటించడానికి ఉత్సాహం చూస్పిస్తున్నాడంటూ చెప్పారు. అయితే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. కన్నడ స్టార్ హీరో సుదీప్ ఉయ్యాలవాడలో ఒక ముఖ్యపాత్ర పోషిస్తున్నాడంటూ ఒక వార్త టాలీవుడ్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
సుదీప్ ని ఈ చిత్రంలో నటింప చెయ్యాలనే ప్లాన్ లో భాగంగా అతనితో చర్చలు జరుపుతున్నట్టు కూడా వార్తలొస్తున్నాయి. ఇప్పటికే సుదీప్ ఈగ చిత్రంలో స్టైలిష్ విలన్ గా అదరగొట్టాడు. మరి ఇప్పుడు ఈ ఉయ్యాలవాడలో వచ్చిన ఛాన్స్ ని ఒప్పుకుంటే ఎలాంటి పాత్రలో కనబడతాడో అనే క్యూరియాసిటీ జనాల్లో క్రియేట్ అయ్యింది. ఇక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రంలో హీరోయిన్ విషయం ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. ఇకపోతే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి టైటిల్ కంటే మహావీర్ టైటిల్ బావుంటుందని చిత్ర యూనిట్ యోచన చేస్తున్నట్లు కూడా వార్తలున్నాయి.

