ఇక ‘చిన్నవాడు’ అందరికీ అందబోడు!!

పెద్ద నోట్ల రద్దు చర్య చిత్ర పరిశ్రమను తీవ్రంగా కుదిపేసిన తరుణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్ర ఫలితం ఇతర చిత్ర నిర్మాతలకు కూడా సందిగ్ధం నుంచి ఊరట నిచ్చింది. అక్కినేని నాగ చైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో చిత్రం వైవిధ్యమైన ప్రేమ కథ గా స్పందన దక్కించుకున్నప్పటికీ కరెన్సీ కష్టాలతో సతమతవుతున్న సగటు ప్రేక్షకుడు థియేటర్ల వైపు కన్నెత్తయిన చూడలేదు. సాహసం శ్వాసగా సాగిపో చిత్రం నష్టాల దిశగా పయనిస్తున్న సమయంలో విడుదల ఐన ఎక్కడికి పోతావు చిన్నవాడా తెలుగు సినిమా వ్యాపారంపై నోట్ల రద్దు ప్రభావం చూపుతుంది అన్న సందేహాలను తీర్చేసింది.
ఎక్కడికి పోతావు చిన్నవాడా దర్శకుడు వి.ఐ.ఆనంద్ గత చిత్రం టైగర్ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో వి.ఐ.ఆనంద్ పేరు ప్రేక్షకులకు సుపరిచితం కాలేదు. దానితో ఎక్కడికి పోతావు చిన్నవాడా కి దక్కిన ప్రచారం అంతా హీరో నిఖిల్ ద్వారానే జరిగింది. విడుదల తరువాత భారీ విజయం అందుకున్న ఎక్కడికి పోతావు చిన్నవాడా నిఖిల్ మార్కెట్ ను ఓవర్సీస్ లోను పెంచటంతో నిఖిల్‌ని సంప్రదిస్తున్న నిర్మాతలకు నిఖిల్ పెంచిన పారితోషికం కంగుతినిపిస్తుంది. నిఖిల్ తన తదుపరి చిత్రాలకు పారితోషికాన్ని దాదాపు రెండింతలుగా పెంచాడని వినికిడి.
కరెన్సీ కష్టాలతో సగటు ప్రేక్షకుడు సతమతమవుతున్న సమయంలోను నిఖిల్ సోలో హీరోగా భారీ విజయం నమోదు చేసి నిరూపించుకున్నాడు కాబట్టి అధిక పారితోషికం కోరటం సబబే అని నిఖిల్ ని సంప్రదిస్తున్న నిర్మాతలూ లేకపోలేదు.

