ఆ హీరో... మిలిటరీ అపరేటివ్ ఆఫీసర్ అంట

జై లవ కుశ లో జై పాత్రకి ఎలాంటి కామెంట్స్ పడుతున్నాయో అందరికి తెలిసిందే. అసలు ఎన్టీఆర్ మరొకసారి అలాంటి పాత్ర చెయ్యగలుగుతాడా? అనే అనుమానంలో చాలామంది ఉండిపోయారు. జై లవ కుశ హిట్ కావడానికి జై పాత్రే కారణం అనడంలో ఎవరికీ ఎటువంటి సందేహం లేదు. జై పాత్ర కోసం ఎన్టీఆర్ పలికించిన హావభావాలు, రావణుడి మాదిరి భయపెట్టడం, ఆ నడత, నడక ఇవన్నీ ఎన్టీఆర్ లోని నటుణ్ని బయటికి తెచ్చాయి. ఎలాంటి పాత్రకైనా ఎన్టీఆర్ సరిపోతాడని భావనలోకి నెట్టేశాడు అందరిని. ఇక ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో చెయ్యబోతున్నాడు.
మరి త్రివిక్రమ్ సినిమాలు ఎలా వుంటాయో అందరికి తెలుసు. అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు తెరకెక్కించడంలో త్రివిక్రమ్ కి సాటిలేరు. ఇక త్రివిక్రమ్ సినిమాలో ఎలాంటి లుక్ లో తారక్ కనబడబోతున్నాడు. అసలు త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ ఎంతవరకు కామెడీ చెయ్యగలడు? అలాగే అసలు ఎటువంటి పాత్రలో కనబడబోతున్నాడు? అనే క్యూరియాసిటిలో ఎన్టీఆర్ అభిమానులే కాదు రెండు తెలుగు ప్రేక్షకులు కొట్టుమిట్టాడుతున్నారు. అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఎన్నడూ కనిపించనటువంటి పాత్రలో కనిపించ బోతున్నట్లుగా చెబుతున్నారు. అంటే ఒక కొత్త తారక్ ని ఈ సినిమాలో చూడబోతున్నామన్నమాట.
త్రివిక్రమ్ చిత్రం లో ఎన్టీఆర్ మిలిటరీ అపరేటివ్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడనే టాక్ వినబడుతుంది. అలాగే ఈ సినిమా మొత్తంలో త్రివిక్రమ్ మార్క్ కామెడీ మరియు ఎమోషనల్ సీన్స్ ఫుల్ గా ఉంటాయట. అలాగే త్రివిక్రమ్... పవన్ తో తెరకెక్కించే సినిమా పూర్తవగానే ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ చేస్తాడంటున్నారు. ఇకపోతే పవన్ - త్రివిక్రమ్ కలయికలో వస్తున్న పవన్ 25 వ చిత్రం జనవరి 10 న విడుదల కానుంది. ఆ సినిమా విడుదల తర్వాతే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా సెట్స్ మీదకెళుతుంది అంటున్నారు. ఇక ఎన్టీఆర్ సినిమా కోసం ఇప్పటికే త్రివిక్రమ్ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ ని హీరోయిన్ గా అను ఇమ్మాన్యువల్ ని సెలెక్ట్ చేసినట్లుగా వార్తలొస్తున్నాయి.

